శివుడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ శ్రేణుల ఫైర్

శివుడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ శ్రేణుల ఫైర్

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: జిన్నారంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతానికి వెళ్తున్న బీజేపీ నాయకులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఇతర నాయకులు జిన్నారం బయలుదేరగా అమీన్​పూర్​ పరిధిలోని సుల్తాన్​పూర్​ ఓఆర్ఆర్​పై పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారందరూ ఓఆర్ఆర్​పై బైఠాయించి పోలీసుల తీరును ఖండించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి తదితరులను రామచంద్రాపురంలోని ఇంటికి తరలించి హౌజ్​అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి, గోదావరి ప్రెస్​మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. జిన్నారంలో ఓ వర్గానికి చెందిన వారు శివాలయంలో విగ్రహాలను ధ్వసం చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే హక్కు తమకు ఉందని శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​శ్రీనివాస్ గుప్తా, అమీన్​పూర్​ మండల అధ్యక్షుడు రాజు, ఇతర జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. 

పటాన్​చెరు(గుమ్మడిదల): సంగారెడ్డి జిల్లా బొంత పల్లి కమాన్​ వద్ద బుధవారం హైటెన్షన్​ వాతావరణం ఏర్పడింది.  జిన్నారం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన హిందూ, ముస్లింల వివాదాన్ని నిరసిస్తూ  ముస్లింలు నేషనల్​ హైవేపై బైఠాయించారు. హిందువులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. దీంతో ఇరు పక్కల వాహనాలు భారీగా స్తంభించాయి. అక్కడే కొద్దిసేపు హిందువులకు, ముస్లింలకు గొడవ ముదరడంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు.