నీలగిరిపై... బీజేపీ లీడర్ల నజర్​

నల్గొండ, వెలుగు :  నల్గొండ నియోజకవర్గంపైన బీజేపీ లీడర్ల కన్ను పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి తమ సత్తా చాటేందుకు బీజేపీ సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికే తలమునకలైన ముఖ్యనేతలు తాజాగా తమ ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశారు. ఓ వైపు పార్టీ పేరుతో, మరో వైపు వ్యక్తిగత ఇమేజ్‌‌ పెంచుకునేందుకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ హైకమాండ్‌‌ ఆశీస్సులతో టికెట్‌‌ వస్తుందన్న నమ్మకంతో నల్గొండ సెగ్మెంట్‌‌లో క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

నల్గొండలో బోణి కొట్టడమే లక్ష్యంగా...

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతవరకు బోణీ కొట్టని బీజేపీ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గెలుస్తామని భావిస్తున్న ముఖ్య నియోజకవర్గాలపైన స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి చేరికతో బీజేపీ లీడర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మునుగోడు, నల్గొండ, దేవరకొండ, భువనగిరి నియోజకవర్గాలపైన నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ ముందుగా జిల్లా కేంద్రంపైనే స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. బీజేపీ బలమైన కేడర్ కలిగిన నల్గొండలో తాజాగా కొత్త తరం లీడర్లు తెరపైకి వచ్చారు. 1999 ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన ఆ పార్టీ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మధ్యలో కొన్నేళ్లు బీజేపీ దూకుడుకు బ్రేక్‌‌ పడింది. మళ్లీ 2019 ఎన్నికల్లో నల్గొండలో ఆ పార్టీకి 20 వేల ఓట్లు వచ్చాయి. నల్గొండ మున్సిపాలిటీలో ఆరుగురు కౌన్సిలర్లు గెలుపొందగా, ఆ ఎన్నికల్లో బీజేపీకి 15 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఈ మూడేళ్లలో బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంపైన పెరుగుతున్న ప్రజావ్యతిరేకత, మోడీ చరిష్మా బాగా పనిచేయడంతో కొత్త కేడర్‌‌ పార్టీలో చేరుతోంది. ఇటీవల చేపట్టిన పార్టీ కార్నర్​మీటింగ్‌‌లు కూడా సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉత్సాహంతో సీనియర్లకు తోడు, జూనియర్లు సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సీనియర్లకు ధీటుగా జూనియర్లు

ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది నూకల నర్సింహారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. అవకాశం కల్పిస్తే నల్గొండ ఎమ్మెల్యేగా, లేదంటే ఎంపీగా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గత గ్రాడ్యుయేట్‌‌ ఎన్నికల్లోనే పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ అవకాశం మిస్‌‌ అయ్యింది. దీంతో వచ్చే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధమైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌‌గౌడ్‌‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్​నేత గరికపాటి మోహన్‌‌రావు సపోర్ట్​తో పాటు, పార్టీ హైకమాండ్​ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెపుతున్నారు. త్వరలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగితే శ్రీనివాస్‌‌గౌడ్‌‌ను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెపుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న శ్రీనివాస్‌‌గౌడ్‌‌ అధ్యక్ష పదవి పట్ల అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన శ్రీనివాస్‌‌గౌడ్‌‌ నియోజకవర్గంలో ఆ పార్టీ పాత కేడర్‌‌తో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో కూడా సీనియర్ల సపోర్ట్‌‌ ఉండడంతో ఈ సారి తప్పక టికెట్‌‌ వస్తదనే నమ్మకంతో ఉన్నారు.


నాగం ఎంట్రీతో మారిన సమీకరణాలు

బీజేపీ జిల్లా కేంద్ర రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన డాక్టర్‌‌ నాగం వర్షిత్‌‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌‌ తనకు వస్తదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌‌ భార్య జమునకు సమీపబంధువైన వర్షిత్‌‌రెడ్డి రాష్ట్ర పార్టీలో గుర్తింపు పొందిన నాయకుడు. నాగం ఫౌండేషన్‌‌ పేరుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యా కన్సల్టెన్సీలు, పలు వ్యాపార సంస్థలు కలిగిన ఆయన పట్టణంలో సొంతంగా హాస్పిటల్‌‌ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో యువకులు, మహిళల పట్ల ఆదరణ పొందేందుకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మహిళా మోర్చాలో కీలక పాత్ర పోషించిన కన్మంతరెడ్డి శ్రీదేవి సైతం ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. ఆమె భర్త ఆర్‌‌బీఐలో రిటైర్డ్​ఉద్యోగి. నల్గొండకు చెందిన  శ్రీదేవి ఆమె భర్త ఉద్యోగ రీత్యా హైదరాబాద్​లో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా లీడర్​గా సేవలందించారు. పార్టీ పెద్దల సపోర్ట్​తో నల్గొండలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే నల్గొండ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్‌‌ రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలని భావిస్తే నూకల నర్సింహారెడ్డితో పాటు, వర్షిత్‌‌రెడ్డి, శ్రీదేవి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని సీనియర్లు  చెబుతున్నారు.