- బీజేపీలో ఎంపీ సీట్లకు తీవ్ర పోటీ!
- ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆశావహులు
- అసెంబ్లీ పోరులో ఓడిన వారు కొందరు.. కొత్తవారు మరికొందరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య లొల్లి మొదలైంది. కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్గిరి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ నెలకొన్నది. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌కి తిరిగి టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గతంలో సన్నిహితుడనే ముద్రపడ్డ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, ఆ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత సుగుణాకర్ రావుతో పాటు స్థానిక నేతలు కొందరు ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇది కమల దళంలో తీవ్ర కలకలం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్ ఓడిపోయినందున తిరిగి పార్లమెంట్ టికెట్ ఆయనకు ఇవ్వొద్దనేది అక్కడి అసమ్మతి నేతల డిమాండ్. ఇదే విషయాన్ని వారు బహిరంగంగానే రాష్ట్ర, జాతీయ నాయకత్వాన్ని కోరడం కరీంనగర్ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం నేతల మధ్య ముదురుతున్న పోరును బయటపెట్టినట్లయింది. ఇక్కడి నుంచి పోటీకి ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన రాష్ట్ర బీజేపీలోని ఓ కీలక నేత ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన అసెంబ్లీ నియోజకవర్గం కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది.
మల్కాజిగిరి టికెట్ కోసం..
మల్కాజిగిరి టికెట్ కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీసీ నేత తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్.. ఇలా ఎవరికి వారే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేది నేనే.. అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తాజాగా రాష్ట్ర బీజేపీలో మరో కీలక నేత కూడా నేను సైతం..అంటూ బహిరంగంగానే ప్రకటించడంతో మల్కాజిగిరి టికెట్ పోరు కమల దళంలో ఆసక్తికరంగా మారింది.
మహబూబ్‌నగర్ సీటుపై చర్చ
మహబూబ్ నగర్ సీటుపై కూడా రాష్ట్ర పార్టీలో హాట్‌గా చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో ఈ ఇద్దరు.. కీలక నేతలే కావడంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపనుందనేది చూడాలి. ఈ ఇద్దరికి తోడు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కూడా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సొంత పార్టీలో పాలమూరు టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది.
జహీరాబాద్ నుంచి పోటీ
జహీరాబాద్ సీటుపై కూడా బీజేపీలో పోటీ తీవ్రంగానే ఉంది. ఇక్కడి నుంచి పోటీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే బీజేపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ కూడా తాను పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ వర్గానికి చెందిన నేత ఒకరు పోటీకి ఆసక్తి చూపడంతో టికెట్ ఎవరికి దక్కనుందనే చర్చ పార్టీలో సాగుతోంది.
ఇక మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్ర బీజేపీలో కీలక పదవిలో ఉన్న ఓ నేత ఇప్పటికే రెండు నియోజకవర్గాలపై కన్నేశాడు. అయితే ఆ రెండు వర్కవుట్ కాని పక్షంలో మెదక్ సీటును అడుగనున్నారనే ప్రచారం రాష్ట్ర పార్టీలో జోరుగా సాగుతోంది. పైగా ఆ నేత ఈ పార్లమెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో రఘునందన్ కు సదరు నేత పోటీగా వస్తున్నారనే ప్రచారంతో రాష్ట్ర బీజేపీలో చర్చ బాగా నడుస్తున్నది.