మల్కాజ్ గిరి సీటుపై కమలం గురి.. టికెట్ దక్కేది ఎవరికో?

మల్కాజ్ గిరి సీటుపై కమలం గురి..  టికెట్ దక్కేది ఎవరికో?

హైదరాబాద్: మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు  స్థానంపై కమల నాథులు కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ లీడర్లు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, పార్టీ  కోసం పనిచేస్తున్న ముఖ్యనేతలు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంటు స్థానంగా పేరున్న ఇక్కడ అన్ని  రాష్ట్రాలకు చెందిన ఓటర్లున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రభావం బాగానే ఉంటుంది. ప్రధాని మోదీ ఎఫెక్ట్, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కలిసి వచ్చి గంపగుత్తగా తమకే ఓట్లు పడతాయని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 10 సీట్లలో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. 

స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. గత నెలాఖరున హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. అంతర్గత కుమ్ములాటలపై ఫైర్ అయిన విషయం విదితమే. బీజేపీ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న సెగ్మెంట్లలో మల్కాజ్ గిరి ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పాగా వేయడం ద్వారా గ్రేటర్ పరిధిలోని రెండో సెగ్మెంట్ ను కొట్టవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. 

ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ తోపాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్  కొమరయ్య, బీజేపీ సీనియర్ నేత ఎస్ మల్లారెడ్డి ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. వీళ్లంతా ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.