బీజేపీలో ఫుల్​ జోష్​

బీజేపీలో ఫుల్​ జోష్​
  • సీట్లతో పాటు పెరిగిన ఓట్ షేర్ 
  • యూనిటీగా పని చేసిన బీజేపీ లీడర్లు
  • ఫలించిన సెంట్రల్ టీం వ్యూహాలు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే అసలైన ప్రత్యామ్నాయం  అంటూ వస్తున్న బీజేపీ ఇప్పుడు ఆ పని చేసి చూపించింది.  2019 లోక్​సభ ఎన్నికల్లో 4 సీట్లను గెలిచిన కమలదళం.. మొన్న దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ సిట్టింగ్ సీటులో విజయం సాధించింది. ఇప్పుడు  జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భారీ సీట్లను రాబట్టుకొని జోరుమీదుంది. 2016 లో జరిగిన గ్రేటర్​ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ కేవలం 4 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా 48  సీట్లలో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. గ్రేటర్​లో సీట్లను భారీగా పెంచుకోవడమే కాదు, ఓట్​ షేర్​ను కూడా అదే స్థాయిలో పెంచుకుంది. దుబ్బాక పల్లెల్లోనైనా, హైదరాబాద్ సిటీలోనైనా తమను ప్రజలు ఆదరిస్తున్నారని బీజేపీ రుజువు చేసింది. సెంట్రల్ టీం వ్యూహం ఫలించి  గ్రేటర్​లో అనూహ్యంగా బీజేపీ దూసుకెళ్లింది. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లో పార్టీ రాష్ట్ర నేతలు కలిసికట్టుగా ముందుకు సాగారు. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం ప్రతిపక్షాలకు ఏమాత్రం ఇవ్వొద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆదరాబాదరాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పిచ్చిందని, అయినా తమ సత్తా చూపుతామని కమలదళం మొదటి నుంచి చెప్తూ వచ్చింది. అనుకున్నట్లుగానే సత్తా చాటింది. గ్రేటర్​లో బీజేపీ భారీగా సీట్లు రాబట్టుకోవడం పార్టీ కేడర్​లో ఫుల్​ జోష్​ను నింపింది. 2016 గ్రేటర్​ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టీఆర్​ఎస్​.. ఇప్పుడు 55 సీట్లకు పడిపోయింది.

కుట్రలను తిప్పికొడుతూ ముందుకు..

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మొదటి నుంచీ బీజేపీ చెబుతూ వస్తోంది. ముఖ్యంగా శుక్రవారం కౌంటింగ్ ఉండగా, గురువారం అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్​పై బీజేపీ హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. సర్క్యులర్​ను హైకోర్టు డిస్మిస్​ చేయడం.. గ్రేటర్​ ఎన్నికల రిజల్ట్స్​కు ముందు తమ పార్టీ సాధించిన నైతిక విజయమని బీజేపీ నేతలు అంటున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ బీజేపీ స్టేట్ ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు కౌంటింగ్​ సరళిని పార్టీ నేతలతో విశ్లేషించుకుంటూ గడిపారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  శుక్రవారం మధ్యాహ్నం పార్టీ స్టేట్ ఆఫీసుకు చేరుకొని.. కౌంటింగ్ సరళిని పరిశీలించారు.  పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతోపాటు ఇతర సీనియర్ నాయకులు కూడా కౌంటింగ్ తీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో 40కి పైగా సీట్లలో బీజేపీ స్పష్టమైన విజయం సాధించినట్లు తేలడంతో పార్టీ ఆఫీసులో సంబురాలు మిన్నంటాయి. సిటీ కేడర్​తో పాటు ఇతర జిల్లాల నుంచి లీడరలు స్టేట్​ ఆఫీసుకు చేరుకొని సంబురాలు జరుపుకున్నారు. పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్​తోపాటు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.

పక్కా ప్రణాళికతో బరిలోకి

గ్రేటర్​ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ ముందస్తుగానే పక్కా ప్రణాళికను రెడీ చేసుకుంది. గ్రేటర్​ సిటీని సంస్థాగతంగా ఆరు  జిల్లాలుగా విభజించి, డివిజన్ల వారీగా పార్టీ పటిష్టతపై ఫోకస్​ పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. సెంట్రల్​, స్టేట్​ లీడర్​షిప్​ నిర్వహించిన సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించింది. ప్రణాళిక బద్ధంగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్​, మాజీ చీఫ్​ లక్ష్మణ్​ తదితరులు ఎప్పటికప్పుడు టీఆర్​ఎస్​ ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను ప్రజల్లో ఎండగట్టారు. మజ్లిస్ తో టీఆర్ఎస్​ దోస్తానాను జనంలోకి బలంగా తీసుకెళ్లారు. తమకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడుతామని, హైదరాబాద్​ను భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బీజేపీ ప్రచారం ప్రజలను ఆలోచింపజేసింది. చార్జ్​షీట్, మేనిఫెస్టో కమిటీల చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి రూపొందించిన టీఆర్ఎస్  ఫెయిల్యూర్స్​పై చార్జ్​షీట్, బీజేపీ మేనిఫెస్టో సిటీ ప్రజలను పార్టీ వైపు మొగ్గు చూపేలా దోహదపడింది. పార్టీ హైకమాండ్​ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని.. రాష్ట్ర లీడర్లకు డైరెక్షన్​ ఇచ్చింది.  బీహార్ ఎన్నికల్లో పార్టీ గెలుపులో  కీలకపాత్ర పోషించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను గ్రేటర్ ఎన్నికలకు ఇన్​చార్జ్​గా  నియమించింది. ఆయన పది రోజుల పాటు హైదరాబాద్​లోనే  ఉండి పార్టీ రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు ప్రకాశ్​ జవదేకర్​, స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య, మహిళా మోర్చ జాతీయ అధ్యక్షురాలు వాసంతి శ్రీనివాసన్ లు రావడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది.