జగిత్యాల టౌన్/కోరుట్ల/మెట్ పల్లి: ఎంపీ అర్వింద్‌పై ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన కరపత్రాన్ని బీజేపీ నేతలు ఖండించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ నాలుగున్నర దశబ్దాల రాజకీయ జీవితం గడిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాజకీయ దాహం తీరకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. ఇటీవలే ఒకర్ని గెలిపించడానికి బీసీ ఆడ బిడ్డనైన తనను ఓడించారని, మళ్లీ మరో బీసీ బిడ్డను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని జీవన్‌రెడ్డిని విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసమే నిజామాబాద్ ఎంపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రఘు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు బీజేపీ హైకమాండ్ఆదేశాలు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. కోరుట్లలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ మాట్లాడుతూ అవినీతి, ఆరోపణలు లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీపై ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కరపత్రం విడుదల చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.