ఖమ్మం, వెలుగు : దాడికి గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎర్నేని రామారావును బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నేతలు ఉప్పల శారద, శ్యామ్ రాథోడ్, ఉపేందర్, కమ్మ సంఘం నేతలు మిక్కిలినేని నరేంద్ర, రంజిత్ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ మంత్రి అజయ్ పేరు చెప్పి దుండగులు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. జిల్లాలో టీఆర్ఎస్ గూండాగిరీకి పాల్పడుతోందని, ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
దాడిని ఖండించిన పొంగులేటి
రామారావుపై దాడిని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర సహాయ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. దాడి గురించి తెలుసుకున్న ఆయన దాడులు మంచి పద్ధతి కాదని, దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో హత్యా రాజకీయాలు జరగడం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
చిన్నారిని దత్తత ఇచ్చిన పేరెంట్స్‌కు కౌన్సిలింగ్
సుజాతనగర్, వెలుగు: మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన బాణోత్ లచ్చా, అనురాధ దంపతులకు ఒక అబ్బాయి, ఇద్దరు ఆడ పిల్లలతో పాటు 42 రోజుల పాప ఉంది. పాపను పెంచే స్థోమత లేక సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి దత్తత ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ ఆఫీసర్లు పాప తల్లిదండ్రులను అడగగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఐసీడీఎస్ ఆఫీసర్లు పోలీసు స్టేషన్ కు పిలిపించి ఎంక్వైరీ చేయగా పాపను అనధికారంగా దత్తత ఇచ్చినట్లు తేలింది. ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి అనధికారంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం నేరమని తెలిపారు. పాపను, వారి తల్లిదండ్రులను కొత్తగూడెం సీడబ్ల్యూసీకి తరలించారు.ఎస్సై తిరుపతి రావు, సీడీపీవో స్వర్ణలత లెనినా, రమాదేవి పాల్గొన్నారు.
సామూహిక కుంకుమార్చన
పాల్వంచ,వెలుగు:పట్టణంలోని శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్ర వారం 108 మంది మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ప్రబోధానంద డాక్టర్ వీర భ ద్రం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పూజలో ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాస రావు, కమిటీ సభ్యులు కోటేశ్వ రరావు, వెంకటేశ్వర్లు, ఎన్వీ రమణ, నెహ్రూ, పిచ్చేశ్వరరావు, నాగార్జున, జి వెంకటేశ్వర్లు, సాదత్ అలీ, అమర్, అచ్యుతరావు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్
కామేపల్లి, వెలుగు: మండలం లోని జాస్తిపల్లి సర్పంచ్ మిక్కిలి కళావతి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పాత లింగాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన సర్పంచ్ మిక్కిలి కళావతి, మిక్కిలి నాగేశ్వరరావుకు కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లీడర్లు గింజల నరసింహారెడ్డి, రెడబోతు గోపిరెడ్డి, రాంరెడ్డి జగన్నాథరెడ్డి, దేవండ్ల రామకృష్ణ, కొరివి యాలాద్రి, దేవండ్ల సీతారాములు పాల్గొన్నారు.
భూదందాలో ఎమ్మెల్యే అనుచరులు
మణుగూరు, వెలుగు: మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ అమ్ముకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ గుట్ట మల్లారం, అశోక్ నగర్ కోర్టు ఏరియాల్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలను ఆపకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్మికుడి కుటుంబానికి ఆర్థికసాయం
పాల్వంచ,వెలుగు: కేటీపీఎస్ ఐదో దశలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆర్టిజన్ కార్మికుడు షేక్ వలీ పాషా కుటుంబసభ్యులకు శుక్రవారం చీఫ్ ఇంజనీర్ కె రవీంద్ర కుమార్ రూ.1,26,350 అందజేశారు. ఫ్యాక్టరీలోని ఆర్టిజన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు తమవంతు సాయం చేశారు. ఎస్ఈలు సంజీవయ్య, అనిల్ కుమార్, మోక్షవీర్, వరప్రసాద్, కృష్ణయ్య, జాన్ వెస్లీ, ఆర్టిజన్లు జానీ పాషా, మసూద్, జానీ, సంగీశెట్టి శ్రీను, సత్యం, కన్నయ్య పాల్గొన్నారు.
విద్యుత్ వైర్లు తగిలి లారీ క్లీనర్ మృతి
అశ్వారావుపేట, వెలుగు: లారీ క్యాబిన్ పై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి లారీ క్లీనర్ హేమరాజ్(41)చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ నుంచి ఏపీలోని రాజమండ్రికి మార్బుల్స్ లోడుతో వెళ్తున్న లారీని అశ్వారావుపేటలో టీ తాగేందుకు ఆపారు. క్యాబిన్ పై చెట్టుకొమ్మలు ఉండడంతో క్లీనర్ హేమరాజ్ పైకి ఎక్కి వాటిని తొలగిస్తున్న క్రమంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. డ్రైవర్, స్థానికులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఖమ్మం టౌన్,వెలుగు: రఘునాథపాలెం మండలం వీవీ పాలెం వద్ద రూ.44 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ కాంప్లెక్స్పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి పనులను పరిశీలించారు. భవన నిర్మాణం ప్లాన్ ను పరిశీలించి, ప్లాన్ ప్రకారం పనులు కొనసాగుతున్నాయా లేదా అని మంత్రి తనిఖీ చేశారు. విద్యుత్ పనులు, ఫ్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, ఫ్లోరింగ్ తదితర పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, పనులు త్వరగా పూర్తి చేసేందుకు అదనంగా కార్మికులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యాంప్రసాద్, ఏఈ భగవాన్, రఘునాథపాలెం తహసీల్దార్ నర్సింహారావు, వీవీ పాలెం సర్పంచ్ రావిళ్ల మాధవి పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచతో పాటు పలు ప్రాంతాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాల్వంచలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తగూడెంలోని ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. పాల్వంచ మండలంలోని సీతారాం పట్నం ప్రాంతంలో 21.5 సెంటీమీటర్లు, లక్ష్మీదేవిపల్లిలో 11.9, పాత కొత్తగూడెంలో 7.2, గరిమెళ్లపాడులో 6.2, అంకంపాలెంలో 4.5, ములకలపల్లిలో 6.3, ఆళ్లపల్లిలో 5 సెంటీమీటర్ల వాన పడింది. పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తింది. 407 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో 405 అడుగుల నీటిమట్టం ఉండగా, ముందు జాగ్రత్త చర్యగా 3 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. పాల్వంచలో భద్రాచలం హైవేపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
కేయూలో ఎంసీఏ కోర్స్ పునరుద్ధరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని కేయూ సబ్ క్యాంపస్ లో ఎంసీఏ కోర్స్ ను పురుద్ధరించాలని, ఎంపీఈడీ, ఎంఏ జర్నలిజం(తెలుగు), ఎమ్మెస్సీ(మ్యాథ్స్) ప్రారంభించేందుకు కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు నామాల ఆజాద్, కార్యదర్శి వెంకటేశ్, లీడర్లు డి రాంబాబు, బి సురేశ్, భుజంగరావు పాల్గొన్నారు.
నిత్యావసరాల అందజేత
పెనుబల్లి, వెలుగు: చైల్డ్‌కేర్ సెంటర్ లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు శుక్రవారం నిత్యావసరాలను అందజేశారు. మండలంలోని పార్థసారథిపురం గ్రామంలోని చైల్డ్‌కేర్ సెంటర్లోని 70 మందికి బియ్యం, గోధుమ పిండి, పంచదార, కందిపప్పు సర్పంచ్ కుంజా సామ్రాజ్యం అందించారు. చైల్డ్‌కేర్ సెంటర్ ఇన్చార్జి వెంకటలక్ష్మి, సభ్యులు రమే శ్, పాషా, గంగభవాని, అనిత పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచ,వెలుగు: మండలంలోని కేశవాపురం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజల్లో దేవస్థాన ధర్మకర్తల అధ్యక్షుడు ఎం రామలింగం, సభ్యులు చింత నాగరాజు, గంధం వెంగళరావు పాల్గొన్నారు.
టీఆర్వీకేఎస్ లో చేరికలు
పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని కేటీపీఎస్ కు చెందిన పలువురు కార్మికులు టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. యూనియ న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేశ్ వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇంటర్ స్టూడెంట్స్ ఆందోళన
వైరా, వెలుగు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి మధు డిమాండ్ చేశారు. వైరా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు. వైరా ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వైరా జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉందని, భవనం పెచ్చులూడి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ లీడర్లు నాగరాజు, శంకర్, సింధు, గీత, రమ్య, రాజేశ్వరి, గీతాంజలి, రాఘవులు, గణేశ్, నితిన్, రాహుల్ పాల్గొన్నారు.
అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు: న్యాయమైన డిమాండ్లు సాధన కోసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సయ్యద్ షౌకత్ అలీ, దేవరకొండ సైదులు, పి. నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిటీలోని ఎస్టీఎఫ్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేవని అన్నారు. ఈ నెల 11 నుంచి హైదరాబాద్ ధర్నా చౌక్ లో రిలే నిరాహారదీక్షలు చేపట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసి నెల రోజులు కావస్తున్నా, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 13న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్ విజయ్, షేక్ మన్సూర్, ఎన్ యాదగిరి, మహ్మద్ హుస్సేన్, షేక్ మహబూబ్ పాల్గొన్నారు.