ఎవరితోనూ పొత్తు పెట్టుకోం : బీజేపీ లీడర్లు

  •     సింగిల్​గానే పదికి మించి సీట్లు గెలుస్తాం
  •     భిక్షాందేహీ అంటున్న రేవంత్ ​సర్కార్​
  •     విజయ సంకల్ప సభలో బీజేపీ లీడర్లు

యాదాద్రి, వెలుగు: పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, సింగిల్‌‌గా పోటీ చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. భువనగిరితో పాటు పది కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విజయ సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో గోవా సీఎం  ప్రమోద్​ సావంత్​ చీఫ్‌‌గెస్టుగా నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ లీడర్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్​రెడ్డి  మాట్లాడారు.  బీజేపీ, బీఆర్​ఎస్​ పొత్తు ఉండదని,  పూలు, పాలు అమ్ముకునేటోల్లు,  బిచ్చమెత్తుకొని కోటీశ్వరులైన వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  

ఆరు గ్యారంటీల పేరుతో పవర్‌‌‌‌లోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కారు వాటిని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఆ పార్టీ ఆరు నెలల్లో ప్రజల చేత ఆరు కొరడా దెబ్బలు తింటుందని హెచ్చరించారు. ఆర్భాటంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కారు ‘భిక్షాందేహీ’ అంటూ కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లిందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు వస్తే గాని జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలోని లేదని ఎద్దేవా చేశారు.  రియల్​ఎస్టేట్​ వ్యాపారుల చేతుల్లో పాలన నడుస్తోందని, నయా నయీంలు భువనగిరిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్​ఎస్​ తరహాలోనే కాంగ్రెస్​ కూడా ప్రజలను మోసం చేసేందుకు దారులు వెతుకుతోందని విమర్శించారు.  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పని చేయకుండా గత సర్కారును నిందించి కాలం గడపాలని చూస్తోందని మండిపడ్డారు.  పేదల  కోసం పని చేస్తున్న బీజేపీని భువనగిరి సహా పదికి పైగా లోక్​సభ స్థానాల్లో గెలిపించాలని కోరారు. గత పదేండ్లలో భువనగిరి  పార్లమెంట్‌‌కు కేద్రం రూ. 9 లక్షల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 

యాదగిరిగుట్టలో బస

భువనగిరిలో ప్రారంభమైన యాత్ర మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకుంది. యాత్రలో పాల్గొనే నాయకులు రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం ఆలేరుకు చేరుకొని అక్కడి నుంచి మోటకొండూరు, ఆత్మకూర్​ ఎస్‌‌కు వెళ్లనున్నారు. 

గోవా సీఎంకు ఘన స్వాగతం

విజయ సంకల్ప యాత్రకు చీఫ్‌‌గెస్టుగా హాజరైన గోవా సీఎం ప్రమోద్​ సావంత్‌‌కు నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం భువనగిరి ఎల్లమ్మ గుడి నుంచి సభ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాశం భాస్కర్​ అధ్యక్షతన జరిగిన ఈ సభలో లీడర్లు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, చింతల రాంచంద్రారెడ్డి , భరత్, కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్​రెడ్డి, బూర నర్సయ్య, పడాల శ్రీనివాస్​, చందా మహేందర్​ గుప్తా, ఉమా శంకర్​రావు పాల్గొన్నారు.