హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ నేతలు కోరారు. ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
‘‘ఈ కేసులో ఇప్పటికే సీనియర్ పోలీసాఫీసర్లను అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్‌ను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి విరాళాలు తీసుకుంది” అని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ ద్రోహానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. “మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ బై పోల్స్ టైమ్ లో మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలవడానికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. పోలీస్, అధికార యంత్రాంగం ద్వారా పోలీస్ వెహికిల్స్ లో డబ్బు పంపిణీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మాఫియా డాన్ లాగా కేసీఆర్ రాష్ర్టాన్ని పరిపాలించిండు. ప్రతిపక్ష నేతల ఫోన్లే కాకుండా బడా వ్యాపారులు, సినిమా వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు ఎంక్వైరీలో తేలింది. ఈ వ్యవహారంలో బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని లక్ష్మణ్ అన్నారు.
‘‘2014 నుంచి 2018 ఎన్నికలు, మధ్యలో వచ్చిన ఎంపీ ఎన్నికలు, బైపోల్స్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు జరిగిన ఈ ట్యాపింగ్ విషయాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తే ఏకైక మార్గం. ఎన్నికల ఫలితాలు రాగానే ట్యాపింగ్ కు ఉపయోగించిన హార్డ్ డిస్క్‌లు, ఇతర వస్తువులు ధ్వంసం చేసి మూసీలో పడేశారు. ఇంతకంటే దారుణం మరేదీ లేదు. ట్యాపింగ్ వెనుక ఉన్న దోషులందరినీ బయటకు లాగాలి” అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఒకే సామాజికవర్గానికి చెందిన అధికారులతో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని, విచారణలో బయటకు వస్తున్న అంశాలు చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవి ఉన్నారు.