యాదాద్రి/రాజాపేట/చండూరు/మేళ్లచెర్వు/కోదాడ, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ లీడర్లు ఆందోళన నిర్వహించారు. భువనగిరిలో మంత్రి ఎర్రబెల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజాపేటలో రాస్తారోకో నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కోదాడలో బీజేపీ లీడర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాత్రకు వస్తున్న ఆదరణను చూడలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే నల్గొండ జిల్లా చండూరులో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుకునేందుకు యాత్ర చేస్తున్న బండి సంజయ్‌పై దాడి చేయడం సరికాదన్నారు. ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ లీడర్లు దాడి చేయడాన్ని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖండించారు. దాడిలో గాయపడిన గుండాల మండలం పెద్ద పడిశాల సర్పంచ్ మల్లేశంను పరామర్శించారు.