క్రమబద్ధీకరణ రుసుం తగ్గించాలని బీజేపీ శ్రేణుల నిరసన

ప్రభుత్వం జీవో 58, 59 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుమును వెంటనే తగ్గించాలని కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్​ డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కుత్బుల్లాపూర్​ తహసీల్దార్​ కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శ్రీశైలం మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా ఇళ్ల క్రమబద్ధీకరణ చేయాలన్నారు. అధిక రుసుమును నిర్ణయించి పేద ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోందని ఆయన ఆరోపించారు. వారికి న్యాయం జరిగే వరకు నిరసనలు విరమించబోమని నేతలు తేల్చి  చెప్పారు.