రైతులను కోటీశ్వరులను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పడు వరి కొనని వారిని రోడ్డుపాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. వరంగల్ లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రేమేందర్ రెడ్డి, రాకెష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘హుజూరాబద్ ఎన్నిక ప్రచార సమయం ముగిసింది. అయినా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులంతా హుజూరాబాద్ లో డబ్బులు పంచుతుంటే.. పోలీసులు మాత్రం మమ్మల్ని చెక్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ లో ఓట్లు కొనడానికి రూ. 120 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుచేస్తోంది. ఓటుకు రూ. 6 వేలు కవర్ లో పెట్టి ఇస్తున్నారు. డబ్బులు పంచేవారిపై చర్యలు తీసుకోవాలి. హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ మీద చాలా సానుభూతి వచ్చింది’ అని వివేక్ అన్నారు.
వరి పంట విషయంలో రాష్ట్ర మంత్రులు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ‘వరి వేస్తే ఉరే అన్న సీఎం వ్యాఖ్యలతో రైతుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. కేంద్రం కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొననని చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదు. అది రైసు మిల్లర్ల ప్రభుత్వం. బాయిల్డ్ రైస్ ద్వారా ప్రభుత్వానికి లాభాలొస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ కు బాయిల్డ్ రైస్ అంటే ప్రేమ. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై స్పష్టతనిచ్చింది. బాయిల్డ్ రైస్ తప్ప మిగతా వడ్లన్నీ కొంటామని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వడ్లను కొంటామని బేషరతుగా ప్రకటించాలి’ అని ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్‌కు అంబులెన్సుల్లో డబ్బులు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ కలెక్టర్ 144 సెక్షన్ విధించినా.. టీఆర్ఎస్ నాయకులు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని.. అయినా కూడా ప్రజలు మాత్రం ఈటల వెంటే ఉన్నారని ప్రేమేందర్ అన్నారు.