తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీ నేతలను నిలదీయాలి: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్

తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీ నేతలను నిలదీయాలి: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్
  • ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి తీరుతాం
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులనే గెలిపించాలి


కామారెడ్డి/బాన్సువాడ/నిజామాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలను  గ్రాడ్యుయేట్లు నిలదీయాలని పీసీసీ ప్రెసిడెంట్  మహేశ్​కుమార్​ గౌడ్  సూచించారు. కేంద్రాన్ని నిధుల కోసం ఒప్పించడం చేతకాని నేతల వల్లే  బడ్జెట్​లో తెలంగాణకు గుండు సున్నా వచ్చిందన్నారు. కాంగ్రెస్​  గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్​రెడ్డికి మద్దతుగా బుధవారం కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్​ నగరంలోని శ్రావ్య గార్డెన్​లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి, తెలంగాణను బంగారు మయం చేస్తామని మోసం చేసిన వారు సహకరిస్తున్నారని బీఆర్ఎస్​పై మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగానే  ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి బీఆర్ఎస్​ తెరవెనుక పని చేస్తోందన్నారు. కాంగ్రెస్  అభ్యర్థి మీద బీఆర్ఎస్, బీజేపీలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని, సోషల్  మీడియాలో వారు చేస్తున్న అనైతిక ప్రచారాన్ని  నమ్మవద్దని సూచించారు.

దేవుళ్ల పేరిట రాజకీయాలు చేసే వారి పట్ల గ్రాడ్యుయేట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ.. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ ఉన్న ఉద్యోగాలను అటకెక్కించిందని ఆరోపించారు. బీఆర్ఎస్  పదేండ్లలో​50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే, కాంగ్రెస్  ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసి తీరుతామన్నారు.

బీసీలకు  స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం  రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయబోతున్నామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో లోపాయికారి ఒప్పందంతోనే బీఆర్ఎస్​ క్యాండిడేట్​ను నిలబెట్టలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్​లో అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

ఎమ్మెల్సీ క్యాండిడేట్​ నరేందర్​రెడ్డి మాట్లాడుతూ తన గెలుపు పక్కా అని తెలిసి బీజేపీ నేతలు విష ప్రచారం మొదలుపెట్టారన్నారు. కేజీ నుంచి పీజీ దాకా అవగాహన ఉన్న తాను గెలిచాక మండలిలో గ్రాడ్యుయేట్స్​ గొంతుకనవుతానన్నారు.  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ,  జహీరాబాద్​ ఎంపీ సురేశ్​​షేట్కార్, ఎమ్మెల్యేలు కె.మదన్మోహన్​రావు, తోట లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి  నరేందర్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.