మూసీ పరీవాహక ప్రాంతాల్లో...నేడు బీజేపీ నేతల బస

  • రేపు ఉదయం 9 వరకు బాధితుల వద్దే..
  • 20 బస్తీల్లో నేతల నిద్ర.. అక్కడే భోజనం
  • అంబర్​పేటలో బస చేయనున్న కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో శని వారం పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం పొద్దున 9 గంటల వరకు అక్కడే బస చేస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. మూసీ పరీవాహక ప్రాంతంలోని 20 బస్తీల్లో.. 20 మంది కీలక నేతలు బస చేస్తారని ఆ పార్టీ లీడర్లు తెలిపారు. ఆయా బస్తీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరికీ తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. శనివారం రాత్రంతా బస్తీవాసుల వద్దే ఉంటారు. ఆదివారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి మూసీ బాధితులతో రచ్చబండ నిర్వహిస్తారు.

బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనేది వీరే..

అంబర్ పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తులసీరామ్ నగర్ లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొంటారు. కమలానగర్ లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, శాస్త్రినగర్ లో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొంటారు. అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్ బస చేస్తారు. సత్యనగర్, న్యూ మారుతీనగర్ లో మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి, మేడ్చల్ రూరల్, ఘట్ కేసర్ లో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్ హౌస్ లో ప్రదీప్ కుమార్ పాల్గొంటారు.

కార్వాన్ డివిజన్ లో తల్లోజు ఆచారి, జియాగూడలో యెండల లక్ష్మీనారాయణ, బహదూర్ పురలో ధర్మారావు, ఓల్డ్ మలక్ పేట్ శాలివాహన్ నగర్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ బస చేస్తారు. గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్ గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుమ్మెరాత్ బజార్ లో సీతారాం నాయక్, గౌలిగౌడలో ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పాల్గొంటారు. హైదర్ గూడ, బహదూర్ పురలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్ లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హైదర్ షాకోట్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఉప్పల్ రామంతాపూర్ లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారు.