ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్ధారుపల్లి గ్రామాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం సందర్శించింది. ఇటీవల హత్య కు గురైన తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబాన్ని బృందం పరామర్శించింది. తమ్మినేని క్రిష్ణయ్య చిత్రపటానికి హైకోర్టు బీజేపీ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ ఆంటోని రెడ్డి, వారి బృంద సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కొంతమంది రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా తమకు న్యాయం జరగలేదని, ఈ కేసును సీబీఐ అధికారులతో దర్యాప్తు చేయించాలని తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం ఆంటోని రెడ్డి మాట్లాడుతూ.. నిందితులు సరెండర్ అయితే కనీసం పోలీసు కస్టడీకి అడిగి ఏం జరిగిందని విచారించాలి..? కానీ ఈ కేసులో అలా విచారించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. న్యాయం కోసం కుటుంబ సభ్యులు వేరే ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నందున సీబీఐ విచారణ జరిపించేందుకు తమ తరపున తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.