
ఏపీ ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో పట్టు పెంచుకోవడంపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్న కమలం పార్టీ.. సొంత బలాన్ని సైతం పెంచుకనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత డా లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని సైతం అక్కడి నుంచే రాజ్యసభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తుందట.
గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేశారు. అంతేకాకుండా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి.. సినిమాలపై ఫోకస్ పెట్టారు. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.