బీజేపీకి దుర్గంధం అంటే ఇష్టం.. అందుకే గోశాలలు నిర్మిస్తున్నారు: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

బీజేపీకి దుర్గంధం అంటే ఇష్టం.. అందుకే గోశాలలు నిర్మిస్తున్నారు: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇటీవలి కాలంలో బీజేపీపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీ విధానాలను సూటిగా తిప్పికొడుతూనే.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే ఔరంగజేబ్ వ్యవహారం, ఛత్రపతి శివాజీ అంశాలపై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశం కాగా.. మరోసారి బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీకి దుర్గంధం అంటే ఇష్టం.. అందుకే గోశాలలు నిర్మిస్తున్నారు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

బీజేపీ ద్వేషాన్ని పెంపొందిస్తోందని.. ప్రజలు ఇలాంటి విద్వేష భావజాలానికి దూరంగా ఉండాలని కనౌజ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అన్నారు. కనౌజ్ లో ఇప్పటికే కొంత మొత్తంలో బీజేపీని ఇంటికి పంపించారని,  వచ్చేసారి పూర్తి స్థాయిలో ఆ పని చేయాలని పిలుపునిచ్చారు. అలా చేసినప్పుడే కనౌజ్ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 

Also Read :- భారత్ పర్యటనకు రష్యా ప్రెసిడెంట్

‘‘వాళ్లు దుర్వాసన అంటే ఇష్టం. అందుకే గోషాలలకు కడుతున్నారు. మాకు సుగంధం (పర్ఫ్యూమ్) అంటే ఇష్టం. అందుకే మేము పర్ఫ్యూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని అన్నారు. 

అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక రైతు బిడ్డ పశువుల నుంచి వచ్చే వాసనను దుర్గంధంగా భావిస్తున్నాడంటే.. అతడి మూలాల నుంచి అతడు దూరమైనట్లే’’నని అన్నారు. పశువుల పేడ దుర్గంధగా కనిపిస్తే.. ఆ నాయకుడు లేదా పార్టీ దాదాపు రాజకీయంగా మూతపడే స్థితికి వచ్చినట్లేనని ఈ సందర్భంగా అన్నారు.