- వరికి బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే కుట్ర: ఏలేటి
- మంత్రి తుమ్మలది తుమ్మితే ఊడిపోయే పదవి
- రైతు హామీలు అమలుచేయాలని సీఎంకు బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక, దుర్మార్గపు పాలన కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీ ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో వసూళ్లు చేపడుతూ.. హైకమాండ్‌కు కప్పం కట్టి కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి తుమ్మలది తుమ్మితే ఊడిపోయే పదవి అని, ఆయన పదవి పోతుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
మంత్రిగా చేతగాని పరిస్థితిలో ఉన్నారని, ఆయనకు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సమన్వయం లేదని చెప్పారు. వరికి బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన తుమ్మల.. జూనియర్ సీఎం మంత్రివర్గంలో మాత్రం ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, 9 నెలల్లో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
బీజేపీ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ దిగి వచ్చింది
కాంగ్రెస్ నేతలు వారి కుర్చీల కొట్లాట గురించి ఆలోచించుకోవాలని, బీజేపీలో అలాంటి పరిస్థితి ఉండదని ఏలేటి తిప్పికొట్టారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మేల్యేలు, నాయకులు, కార్యకర్తలు, రైతులంతా కలిసి దీక్ష చేస్తేనే కాంగ్రెస్ దిగి వచ్చి ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పారని తెలిపారు. కాగా, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఏలేటి బహిరంగ లేఖ రాశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీసులో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.