- సుంకిశాల ఘటనలో ఆ కంపెనీకి షోకాజ్ మా విజయమే
హైదరాబాద్, వెలుగు: మేఘా ఇంజినీరింగ్ కంపెనీ చేసిన తప్పిదాలన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుంకిశాల ఘటనలో ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం బీజేపీ విజయమన్నారు. అక్కడ తప్పు జరిగింది కాబట్టే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారులో కొత్త సమస్య మొదలైందని, ముఖ్యమంత్రి పీఠంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారని ఆయన ఆరోపించారు.
కర్నాటకలో డీకే శివకుమార్ తరహాలో తెలంగాణలో పొంగులేటి మారారని చెప్పారు. ప్రభుత్వంలో భట్టి విక్రమార్క కంటే పవర్ ఫుల్ సెంటర్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో కుర్చీలాట నడుస్తోందని, రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 కోసం తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. సీఎం సొంత ఏరియాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి పాలమూరు ప్రాజెక్టులో సగం వర్క్స్ ఇచ్చారని, కొడంగల్ ప్రాజెక్టు కూడా సీఎం చెప్పిన కంపెనీకి కాకుండా పొంగులేటి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. పొంగులేటితో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని మీడియాలో చూశానని, దీనిపై నిజనిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.