- హైదరాబాద్‌లో సీట్లు రాలేదని పేదల ఇండ్లు కూలుస్తున్నరు: ఎంపీ అర్వింద్
- రుణమాఫీ చేసింది కొంతే.. చెప్పేదేమో కొండంత: ఎంపీ అరుణ
- ధర్నాచౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను కాంగ్రెస్మోసం చేస్తే.. తాము అండగా ఉంటామని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డితెలిపారు. రైతులు ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలిచిందని, కానీ గెలిపించిన వారినే ఆ పార్టీ మోసం చేసిందని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్‌గాంధీ సమక్షంలో కేవలం అధికారంలోకి వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దాదాపు రూ.81 వేల కోట్లు ఖర్చు చేసి, ప్రతి ఏటా రైతులను ఆదుకుంటామని చెప్పిన మాటలు మరిచిపోయారా? లేదా మరిచిపోయినట్టు నటిస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో బీజేపీ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో సోమవారం రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని రైతుల్లో రెండో వంతు మందిని మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక జూలై 30 వరకు 870 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సెప్టెంబర్ 30 వరకు లెక్క మొత్తం వెయ్యికి చేరిందని చెప్పారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారన్నారు.
కేబినెట్ లో మాత్రం రూ. 31 వేల కోట్లు అని నిర్ణయం తీసుకున్నారని, తీరా బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతున్న మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చి, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించేందుకే తాము దీక్ష చేపట్టామని చెప్పారు.
కేసీఆర్ ఫాం హౌస్‌లో స్టడీకి టీంను పంపాలి: ఎంపీ అర్వింద్
కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని, అందుకే పేదల ఇండ్లను కూలుస్తున్నదని ఎంపీ ధర్మపురి అర్విం ద్ఆరోపించారు. తెలంగాణలో 9 ఏండ్లపాటు కేసీఆర్ ప్రజాకంటగింపు పాలన చూశామని, రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాచరిక పాలన సాగించారని అన్నారు. దీంతో ప్రజలు ఆయనకు కర్రుకాల్చి వాతపెట్టి, గద్దె దింపారని చెప్పారు. ‘‘కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఒక ఎకరాకు కోటి సంపాదిస్తున్నాడట. కోటి సంపాదన ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి స్టడీ కోసం ఒక టీమ్‌ను కేసీఆర్ఫాం హౌస్‌కు పంపాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్” అని అన్నారు.
బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదు: డీకే అరుణ
ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. రుణమాఫీ చేసింది కొంతేనని, కానీ చెప్పుకొనేది మాత్రం కొండంత అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ కు.. బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. నాడు బీఆర్ఎస్ అమలుచేసిన విధానాలనే నేడు కాంగ్రెస్అమలుచేస్తున్నదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కేసీఆర్ పదేండ్లపాటు అనేక హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగాడని ఎంపీ ఈటల రాజేందర్‌అన్నారు. హైడ్రా బూచి చూపుతూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి, హైకమాండ్ కు పంపుతున్నారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్సర్కారు హైడ్రాను తీసుకొచ్చి, ఇండ్లను కూల్చివేస్తున్నదని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కో ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.