హైదరాబాద్, వెలుగు: పాతబస్తీతో పాటు సల్కం చెరువులోని ఆక్రమణలను కూల్చాకే.. మిగితా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ముందుగా హైడ్రాను పాతబస్తీలో ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాల్సిందిగా ఆదేశించాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
సల్కం చెరువులోని ఓవైసీ భవనాల్లో విద్యా సంస్థలున్నాయని, అకడమిక్ ఇయర్ పూర్తయ్యాక వాటిని కూల్చేస్తామంటున్నారని, ఇదే ఫార్ములా ఇతర విద్యాసంస్థలకు ఎందుకు వర్తించదో చెప్పాల న్నారు. హైడ్రాను తెచ్చింది హిందువులపై మాత్రమే ప్రయోగించడానికా? అని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్న చందంగా ఉందన్నారు. పాతబస్తీలో కూల్చివేతలపై తాను ప్రశ్నిస్తే.. రంగనాథ్ పరిధి దాటి తనపై కామెంట్లు చేశారన్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.