మహారాష్ట్రలో బీజేపీ డబుల్ సెంచరీ.. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎన్ని ఎక్కువ వచ్చాయంటే..

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. వార్ వన్సైడ్ అయినట్టేనని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసి రికార్డు విజయం దిశగా దూసుకెళుతోంది. శనివారం (నవంబర్ 23, 2024) ఉదయం 10.45 నిమిషాల సమయానికి 219 స్థానాల్లో ఎన్డీయే లీడ్లో ఉండగా, 58 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యం కనబర్చింది. 11 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు.

మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 145. ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ చారిత్రక విజయాన్ని నమోదు చేసే దిశగా మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి దూసుకెళుతోంది.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహాయుతి కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ సీఎం సీటు కోసం గట్టి పోటీనే నెలకొంది. తమ పార్టీ నేతే సీఎం అంటూ కూటమిలోని అన్ని పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమిలోని శివసేన (షిండే) అధికార ప్రతినిధి సంజయ్​ షిర్సత్​ మాట్లాడుతూ.. ఏక్​నాథ్​ షిండే సీఎం అనే నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. షిండేను చూసే మహారాష్ట్ర ప్రజలు మహాయుతి  కూటమికి ఓట్లేశారని అన్నారు. మహారాష్ట్రకు మళ్లీ  షిండే సీఎం అవుతారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​సీఎం అవుతారని బీజేపీ నేత ప్రవీణ్​ దారేకర్​ అన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం పదవి చేపట్టాల్సి వస్తే అది దేవేంద్ర ఫడ్నవీసేనని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్​, డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​పేరును ఆ పార్టీ నేత అమోల్​ మిట్కారీ సీఎం రేసులోకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ కింగ్​ మేకర్​అవుతుందని చెప్పారు. పుణెలో  డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ నెక్ట్స్ మహారాష్ట్ర సీఎం అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పరిణామాలన్నీ సీఎం పదవి కోసం మహారాష్ట్రలో రసవత్తర పోటీ ఉండనుందనే సంకేతాలిస్తున్నాయి.