మిడ్జిల్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టేనని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్ డీకే అరుణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఊరుకొండ, మిడ్జిల్ మండల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలు గడపగడపకు తిరిగి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు.
గత బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని ఆరోపించారు. బాల త్రిపుర సుందరి, వేణుగోపాల్ రెడ్డి, రాజేశ్వర్, తిరుపతి, ముచర్ల జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, తిరుపతమ్మ పాల్గొన్నారు.
చిన్నచింతకుంట: బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ డీకే అరుణ కోరారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాలకు చెందిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పాలమూరు పార్లమెంట్ సీటును పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే కురుమూర్తి ఆలయాన్ని డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. యజ్ఞభూపాల్ రెడ్డి, ఎగ్గని నర్సింలు, సుదర్శన్ రెడ్డి, నంబిరాజు, కుర్వ రమేశ్, ప్రశాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.