నిర్మల్ జిల్లా కేంద్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ముసుగులో బీఆర్ఎస్ నేతలు రూ.2 వేల కోట్ల కుంభ కోణానికి తెర తీసినట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి ఆరోపించారు.
మాస్టర్ ప్లాన్ పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మహేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళిసైని కలిశారు. విచారణ జరిపించాలని గవర్నర్ ని కోరి వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం మహేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చి రూ.కోట్ల కుంభ కోణాలకు తెర తీశారని ఆరోపించారు.
ప్లాన్ అమలుకు వ్యతిరేకంగా పోరాడిన రైతులు, ప్రతిపక్ష నేతలపై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హెచ్ ఆర్ సీ లోనూ ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్లాన్ రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.