నస్పూర్, వెలుగు: బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, గని కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3వ గని, మున్సిపాలిటి పరిధిలోని విద్యానగర్లో పర్యటించి మాట్లాడారు. కార్మికుల పిల్లలు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారని, కార్మికులు ఎంతో కష్టపడి సింగరేణికి లాభాలు తీసుకువస్తే కనీసం వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించకపోవడం యాజమాన్యం, ఇక్కడి ఎమ్మెల్యే చేతగానితనమేనని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్, జేఎన్టీయూ కాలేజీని నస్పూర్లో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని విద్యానగర్లో పాదయాత్ర చేపట్టి కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, కాదాసు భీమయ్య, కాశెట్టి నాగేశ్వర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద కృష్ణ, పార్లమెంట్ఎస్సీ మోర్చా కన్వీనర్ పనుగంటి మధు, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కొండ వెంకటేశ్, జిల్లా కార్యదర్శి మద్ది సుమన్, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు సిరికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ గెలిస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు
మంచిర్యాల: మంచిర్యాల పట్టణం 5వ వార్డులోని శ్రీ నగర్లో వెరబెల్లి స్రవంతి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలోని ప్రధాని మోదీ నాయకత్వంలో పేదలు, అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. కానీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలేదన్నారు. ఆ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలంటే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బోయిని హరికృష్ణ, జోగుల శ్రీదేవి, రాకేశ్, ప్రభ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.