ఎల్లుండే మోదీ సభ.. కిషన్ రెడ్డికి ఫస్ట్ టాస్క్

పార్టీ సీనియర్ నేతలతో సమావేశం

  • వరంగల్‌‌ సభను సక్సెస్‌‌ చేయాలని సూచన
  • ఉమ్మడి వరంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌‌చార్జుల నియామకం
  • వరంగల్ వెస్ట్ ఇన్‌‌చార్జ్‌‌గా బండి సంజయ్
  • భారీగా జనాన్ని తరలించాలని నిర్ణయం

కిషన్‌‌ రెడ్డి ఫస్ట్‌‌ మీటింగ్‌‌కే బండి సంజయ్ గైర్హాజర్

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర​అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌‌రెడ్డికి తొలి టాస్క్‌‌ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో వరంగల్‌‌లో నిర్వహించనున్న బహిరంగ సభ సక్సెస్‌‌ బాధ్యత అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీ రాష్ట్ర చీఫ్‌‌గా ఆయనపైనే పడింది. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వరంగల్‌‌కు ప్రధాని వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కిషన్‌‌రెడ్డి.. పార్టీ స్టేట్ ఆఫీసు బేరర్లతో, అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో గచ్చిబౌలిలోని ఓ హోటల్‌‌లో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి బీజేపీ నాయకులతో నిర్వహించిన తొలి మీటింగ్‌‌ ఇది. ఎలక్షన్ మేనేజ్‌‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, నేతలు విజయశాంతి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, రవీంద్ర నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బాబు మోహన్, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, గజ్జల యోగానంద్, రచనా రెడ్డి, రాణిరుద్రమతో పాటు పలువురు ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. అయితే ఈ కీలక భేటీకి బండి సంజయ్ హాజరుకాలేదు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌తో అపాయింట్‌‌మెంట్ ఖరారైనందున మీటింగ్‌‌కు రాలేకపోతున్నట్లు సంజయ్ సమాచారం ఇచ్చారు. 

జన సమీకరణపై చర్చ

ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కిషన్‌‌రెడ్డికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి వెంట ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వీరు గచ్చిబౌలి వెళ్లిపోయారు. అక్కడ జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి ప్రధానంగా మోదీ సభకు జన సమీకరణపైనే చర్చించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించడంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. 

ప్రధాని సభను సక్సెస్ చేసి తెలంగాణలో బీజేపీ సత్తా చాటాలని, వరంగల్ సభతో చరిత్ర సృష్టించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌‌చార్జులుగా నియమితులైన వారు వెంటనే అయా నియోజకవర్గాలకు వెళ్లి జన సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మీటింగ్‌‌లో కిషన్ రెడ్డిని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సన్మానించారు. ఈనెల 10న మరోసారి ఆఫీస్ బేరర్ల మీటింగ్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

మూడ్రోజులు వరంగల్‌‌లోనే

గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు మోడీ ప్రోగ్రామ్ ముగి సే దాకా వరంగల్‌‌లోనే కిషన్‌‌రెడ్డి మకాం వేయను న్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లి.. మోదీ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనున్నా రు. సభా ఏర్పాట్లు, జన సమీకరణపై స్థానిక బీజేపీ నేతలతో చర్చించి, వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. రైల్వే పీఓహెచ్ శంకుస్థాపన, మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌కు శంకుస్థాపన చేయనుడండడంతో సంబంధిత అధికారులతో కూడా ఏర్పాట్లపై చర్చించనున్నారు.

పార్టీ స్టేట్ ఆఫీసులో కనిపించని సందడి

ఆషాఢం కావడంతో పార్టీ రాష్ట్ర చీఫ్‌‌గా బాధ్యతలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదు. ఆషాఢ మాసం తర్వాతే ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం జరిగినా.. పార్టీ స్టేట్ ఆఫీసులో, సిటీలో, జిల్లాల్లో ఎక్కడా సంబురాలు, సందడి కనిపించలేదు. రాష్ట్ర నేతల్లో పెద్దగా హడావుడి కనిపించలేదు. మంగళవారం కిషన్ రెడ్డిని రాష్ట్ర చీఫ్‌‌గా, బుధవారం రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించినా.. లీడర్లు, క్యాడర్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.