బీజేపీ మెంబర్​షిప్​ డ్రైవ్.. ప్రతి బూత్​లో 200 సభ్యత్వాలు టార్గెట్

బీజేపీ మెంబర్​షిప్​ డ్రైవ్.. ప్రతి బూత్​లో 200 సభ్యత్వాలు టార్గెట్
  • వచ్చే నెల 1 నుంచి బీజేపీ మెంబర్​షిప్​ డ్రైవ్
  • సభ్యత్వాలను రెట్టింపు చేయడంపై నజర్  
  • లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్​గా ముందుకు.. 
  • ఈ నెల 21న రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై బీజేపీ దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్​గా తీసుకోవాలని 
నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సభ్యత్వాలను డబుల్  చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నది. ప్రతి బూత్ లో కనీసం 200 సభ్యత్వాలు చేయించడంపై దృష్టి పెట్టింది. త్వరలో జరిగే లోకల్  బాడీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవాలని నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెంబర్​షిప్​ డ్రైవ్  కోసం కసరత్తు ప్రారంభించింది. 

రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరితో పాటు ఒక టీచర్  ఎమ్మెల్సీ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిచింది. ప్రజల నుంచి లభించిన ఈ సానుకూలతను అందిపుచ్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా పార్టీ మెంబర్ షిప్  డ్రైవ్​లో  భాగంగా సెప్టెంబరు 1 నుంచి తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కమలం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. 

రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా మెంబర్​షిప్​ డ్రైవ్​పై ఢిల్లీలో ఆ పార్టీ చీఫ్  నడ్డా అన్ని రాష్ర్టాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో సభ్యత్వ డ్రైవ్ ఫాలో అప్​ కోసం అరవింద్  మీనన్​ను ఇన్​చార్జీగా  నియమించారు. సభ్యత్వ నమోదుపై ఈనెల 21 రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. దీనికి రాష్ట్ర ఆఫీస్ బేరర్లతో పాటు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు  మెంబర్​షిప్​ ఇన్ చార్జీలు, సీనియర్  నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం తర్వాత జిల్లా, మండల, గ్రామ స్థాయిలోనూ ఈ నెలాఖరు వరకూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.