రేవంత్ ఖబర్దార్.. ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రేవంత్ ఖబర్దార్.. ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ ఖబర్దార్.. ప్రధాని మోడీపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకొనేందుకు ప్రధాని మోడీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి బీసీ కులానికి చెందిన మోడీ ప్రధానిగా ఉండటం ఓర్వలేకే గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ బాటలోనే నడుస్తూ.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీపై రేవంత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. 

ALSO READ | మోడీ కన్వర్టెడ్ బీసీ.. దమ్ముంటే కేంద్రం కుల గణన చేయాలి: సీఎం రేవంత్ సవాల్

కాగా, శుక్రవారం (ఫిబ్రవరి 14) గాంధీభవన్‎లో కుల గణనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని.. అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన నివేదికను తప్పు అంటూ మోడీ, కేడీ బీసీలను మో సం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సర్టిఫికేట్స్‎లో మోడీ బీసీ కానీ.. ఆయన మనసు అంత బీసీ వ్యతిరేకి అని విమర్శించారు. ఈ క్రమంలోనే రేవంత్ కామెంట్స్‎పై బీజేపీ నేతలు ఫైర్ అవుతూ కౌంటర్ ఇస్తున్నారు.