మేఘా అవినీతిపై పోరాడుతం : బీజేపీఎల్పీ నేత ఏలేటి

మేఘా అవినీతిపై పోరాడుతం : బీజేపీఎల్పీ నేత ఏలేటి

= ప్రభుత్వం ఎందుకు నోటీసులివ్వలేదు
= పైసల కోసమే ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడ్తలేరా

హైదరాబాద్: మేఘా కంపెనీ తెలంగాణలో 56 పనులు చేపడితే అందులో ఒక్కటీ పూర్తి కాలేదని, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేని  బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కాంట్రాక్టు సంస్థతో ఎందుకు పనులు చేయిస్తున్నదంటూ ప్రశ్నించారు.

మేఘా సంస్థ కేరళలో చేసిన పనుల్లోనూ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు.  ఇంత జరుగుతున్నా ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. మేఘా చేసిన పనులను ఎందుకు పబ్లిక్ డొమయిన్లో పెట్టడం లేదన్నారు.  కూలిపోయిన కాళేశ్వరం, సుంకిశాల పనులను మేఘాతోనే మళ్లీ చేయించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి మేఘా కంపెనీ నిధులు సమకూర్చుతోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో ఉందని, గత బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ 62 వేల కోట్ల అప్పు తెచ్చారని అన్నారు.  సీఎం కాకముందు అవినీతి పై ఆరోపణలు  చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు.