పాట్నా: ఆడవాళ్లపై చెయ్యి వేసే దుర్మార్గుల చేతులను నరికివేయాలని బిహార్లోని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ అన్నారు. శనివారం దసరా సందర్భంగా సీతామఢీ జిల్లా కేంద్రంలో స్కూల్, కాలేజీ బాలికలకు ఆయన కత్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిథిలేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మన అక్కాచెల్లెళ్లను ముట్టుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తే, వాడి చేతిని ఈ కత్తితో నరికివేయాలి” అని అన్నారు.
‘‘తమపై చెయ్యి వేసే దుర్మార్గుల చేతులను నరకగలిగే విధంగా మన అక్కాచెల్లెళ్లను తయారు చేయాలి. ఆడవాళ్ల విషయంలో దుర్బుద్ధితో ఉన్నోళ్లందరినీ నాశనం చేయాలి” అని చెప్పారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు మండపాల దగ్గర బాలికలకు కత్తులను ఎమ్మెల్యే మిథిలేశ్ పంపిణీ చేశారు.