మహబూబ్‌నగర్: దమ్ముంటే టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సోమవారం జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోషం ఉన్న బిడ్డ కాబట్టే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని వెల్లడించారు. కానీ రాజీనామా చేయకుండానే మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారన్నారు. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి... అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఓటు వేసినా... కాంగ్రెస్ కు ఓటు వేసినా ఒక్కటేనన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరు గెలిచినా చివరకు కేసీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందన్నారు. ఒక దళితుడు, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసిన గొప్ప చరిత్ర బీజేపీదన్నారు. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి దళితుడే సీఎం అవుతారని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. హుజురాబాద్ లో వచ్చిన ఫలితాలే మునుగోడు ఉప ఎన్నికలో వస్తాయని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.