హనుమకొండ: స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికను ఇంతవరకు ఎవరూ చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటిది ఎవరూ చూడకూడదని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను టీఆర్ఎస్ ఖరీదుగట్టిందని ఆరోపించారు. ఓట్లను అంగట్లో సరుకులా భావించే కొనేందుకు కేసీఆర్ నీచ ప్రయత్నం చేశారన్నారు. పేదరికానికి కులం ఉంటుందా అని ప్రశ్నించారు.
‘హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నియోజకవర్గంలోని గ్రామాలకు గ్రామాలను దావత్‌లకు అడ్డాగా మార్చారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తికి కౌన్సిలింగ్ నిర్వహించి.. మఫ్టీ పోలీసులను పెట్టారు. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా కేంద్రీకరించి.. గులాబీ కండువా వేసి వాళ్లు నిర్వహించిన పాత్ర అత్యంత జుగుప్సాకరమైంది. సమాజం ఈ చర్యను అసహ్యించుకుంది. ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా చేసిన పనిని.. కేసీఆర్ నియంతృత్వ పోకడలను, ఆయన అహంకారాన్ని హుజూరాబాద్ ప్రజలు పాతరేశారు. ప్రలోభాలకు తెలంగాణ సమాజంలో తావులేదని నిరూపించారు. డబ్బులతో ఆత్మగౌరవాన్ని కొనలేరని గొప్ప తీర్పును ఇచ్చారు. హుజూరాబాద్.. ప్రజాస్వామ్యానికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన నియోజకవర్గం. ఇది అందరికీ దిక్సూచిగా నిలిచిన నియోజకవర్గం. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిది’ అని ఈటల రాజేందర్ చెప్పారు.