డ్రైవర్ బ్రతుకు ఆగమ్య గోచరం

తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్ బ్రతుకు ఆగమ్యగోచరంగా తయారైందని, అమ్మ పెట్టదు.. అడక్క తిననివ్వదు అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎండగట్టారు. తెలంగాణలో అడుగులకు మడుగులు వొత్తే నాయకులు తప్ప ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. 2022, మే 21వ తేదీ శనివారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ట్యాక్సీ డైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘డైవర్స్ హక్కుల సాధన’ పేరిట సంకల్ప దీక్ష జరిగింది. ఈ దీక్షకు ఎమ్మెల్యే ఈటల హాజరయ్యారు. దీక్షకు 11 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఏంటీ అని ప్రశ్నించారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలానే చేస్తే తెలంగాణ ఉద్యమం చేయగలిగే వాళ్ళమా ? అని నిలదీశారాయన. తాను 48 గంటలు ఇందిరా పార్క్ రోడ్డు మీద, శాసన సభ పోడియం దగ్గరే పడుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వల్ల మొట్టమొదట ఈ రంగమే దెబ్బతిన్నందని.. క్యాబ్స్, డ్రైవర్స్. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇందులో డ్రైవర్ లు, కంప్యూటర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు..తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక పోతున్నారన్నారు. కరోనా కారణంగా డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దీని కారణంగా వాళ్లు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ చేయించుకోలేదన్నారు. అసోసియేషన్ చేస్తున్న 16 డిమాండ్స్ లను నెరవేర్చాలని ఎమ్మెల్యే ఈటల డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నట్లు.. ప్రభుత్వం వీరికి రూ. 25 లక్షలు ఇన్సూరెన్స్.. అంగవైకల్యం అయితే రూ. 5 లక్షలు అందించాలని వెల్లడించారు. 

రుణాలన్నింటి మీద ప్రభుత్వ ఒక పాలసీ తీసుకరావాలని, సీజ్ చేయబడ్డ వాహనాలను విడుదల చెయ్యాలన్నారు. ఫైన్ వేయకుండా ట్యాక్స్ అన్నీ కట్టించే అవకాశం కల్పించాలని, మానవతా కోణంలో ఆలోచించి పాత ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ మాఫీ చేయాలని సూచించారు. దళిత బంధులాగా.. డ్రైవర్స్ లైసెన్స్ ఉన్న వారికి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. అందరూ బతికేందుకు వీలుగా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ధనిక రాష్ట్రం నిజమే అయితే ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారని సూటిగా ప్రశ్నించారు. రూ. 25 వేల కోట్ల అధిక భారం ఉందని.. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. బాధలు చెప్పుకుందామని అంటే.. నియంత్రణ పెట్టి భయపెడుతున్నట్లు.. ఈ పద్దతి చెల్లదని వెల్లడించారు. ఇది రాచరికం కాదని.. ఆరు నెలల తర్వాత ఇది చెల్లదన్నారు. 2023 డిసెంబర్ వరకే ప్రజలు అధికారం ఇచ్చినట్లు.. రెండోసారి వచ్చిన తరువాత కేసీఆర్ అసలు నిజ స్వరూపం బయటపడిందన్నారు. కేసీఆర్ డబ్బు, మద్యం నమ్ముకున్నట్లు, హుజురాబాద్ లో కేసీఆర్ చెంప చెళ్లు మనిపించినట్లు.. ఇదే తీర్పు రాష్ట్రం అంతా వస్తుందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటుతో పాతర వేసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.

మరిన్ని వార్తలు కోసం : -

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు


ఉజ్వల పథకం సిలిండర్పై రూ. 200 సబ్సిడీ