ప్రజలు తలుచుకుంటేనే రాజ్యాంగ పదవులొస్తాయి

  • బీజేపీ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఈటల రాజేందర్ 

రాజకీయాల్లో ఎంత ఎదిగినా ప్రజల ముందు ఒదిగి ఉండాలని, ప్రజల కాళ్లల్లో ముళ్లు విరిగితే పన్నుతో తీయాలని, నేల విడిచి సాము చేయొద్దని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలనే ఆశ చాలా మందికి ఉంటుందని, ఆ కలను సాకారం చేసుకునే దిశగా పని చేయాలన్నారు. విజయాలు సాధించిన వారి అనుభవాలను అధ్యయనం చేయాలన్నారు. ఏ పదవి అయినా మార్కెట్ లో దొరకదని, కుటుంబ సభ్యులో లేక బంధువులో ఇచ్చేది కాదన్నారు. ప్రజలు తలుచుకుంటేనే రాజ్యాంగ పదవులొస్తాయన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ రాజకీయ శిక్షణ తరగతులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘనందన్ రావు హాజరయ్యారు. 

నాయకుని పనితీరు, పార్టీ పనితీరు చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్ప డబ్బును చేసి ఓట్లు వేయరని ఈటల రాజేందర్ అన్నారు. గెలిపించిన తర్వాత ప్రజలను మరిచిపోతే మళ్లీ వాళ్లే బుద్ధి చెబుతారని చెప్పారు. పదే పదే గెలవాలంటే ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా పొందేలా పని చేయాలన్నారు. ఎవరి క్షేత్రంలో వారు నిత్యం ప్రజల మధ్య ఉండి పని చేయాలని చెప్పారు. బీజేపీ అధికారంలో లేదనే ఉద్దేశంతో ప్రజల వద్దకు వెళ్లకూడదనే భావన సరికాదన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేవాళ్ల వైపే ప్రజలు నిలుస్తారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కొట్లాడితే, బీజేపీ మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ప్రజలు మాత్రం కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ నే గెలిపించారని, ఇదే సూత్రాన్ని ఇప్పుడు మనం (బీజేపీ) పాటించాలన్నారు. దళితబంధు పథకం తన వల్లే వచ్చిందని చాలామంది తన వద్దకు వచ్చి చెబుతున్నారని అన్నారు. హుజురాబాద్ లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తాడన్న నమ్మకంతోనే ప్రజలు తనవైపు నిలిచారని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

నేపాల్ లో కూలిన విమానం.. 22 మంది మృతి !