హైదరాబాద్​లో 171 చెరువులు పూర్తిగా కబ్జా : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి

హైదరాబాద్​లో 171 చెరువులు పూర్తిగా కబ్జా : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
  • చెరువుల్లో 30 రియల్ ఎస్టేట్​ సంస్థల​ నిర్మాణాలు
  • తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే సూసైడ్ చేస్కుంటనని సవాల్  

హైదరాబాద్/ఖైరతాబాద్, వెలుగు : హైదరాబాద్​లో 171 చెరువులు వందశాతం కబ్జాకు గురయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తెలిపారు. నగర చెరువుల్లో 30 రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్మాణాలు చేపడుతున్నాయని చెప్పారు. చెరువుల ఆక్రమణలపై తాను పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని, తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటానని సవాల్ విసిరారు. ‘‘కబ్జాకు గురైన చెరువులు, వాటిల్లో నిర్మాణాలు చేపడుతున్న సంస్థల సమాచారం మొత్తం నా దగ్గర ఉంది. పక్కా ఆధారాలతో సహా వివరాలు ఇస్తాను. వాటిని కూల్చే దమ్ము సర్కార్ కు ఉందా?” అని ప్రశ్నించారు.

చెరువుల ఆక్రమణపై ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో కాటిపల్లి మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డికి దమ్ముంటే చెరువులు, నదుల వెంట అక్రమ పర్మిషన్లు​ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్నారని, పెద్దలవి మాత్రం కూల్చడం లేదని మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలకు ముందే చర్చలకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ‘‘హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు సాయం చేసేందుకు ఇప్పటి వరకు నేను తీసుకున్న జీతం మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు అలా ఇవ్వగలరా.. ఆ దమ్ముందా?’’ అని సవాల్ విసిరారు. 

భట్టి రిపోర్టులో క్లారిటీ లేదు.. 

హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి 190 పేజీల రిపోర్ట్ ఇచ్చారని, కానీ ఆయన ప్రజంటేషన్ లో క్లారిటీ లేదని కాటిపల్లి అన్నారు. 20, 30 గుంటలు తప్ప.. ఎకరాల్లో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటల లెక్కలు భట్టికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చెరువులు కబ్జాకు గురయ్యాయని చెబుతున్న భట్టి.. వాటిని ఎవరు కబ్జా చేశారనేది మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు.

గత ప్రభుత్వంలో చెరువులను సెజ్‌‌‌‌‌‌‌‌లుగా మార్చి.. ఫీనిక్స్, స్కైల్యాండ్ లాంటి కొన్ని నిర్మాణ కంపెనీలకు అప్పజెప్పారు. నార్సింగిలో 19 ఎకరాల మొక్కసానికుంటను ఫీనిక్స్, స్కైల్యాండ్ కంపెనీకి ఎలా అప్పజెప్పారు? హెచ్ఎండీఏ అప్రూవల్ తో ప్రేమావతి పెద్దచెరువు బౌండ్రీని తగ్గించి 15 ఎకరాల్లో ప్రిస్టేజ్ కంపెనీ విల్లాల నిర్మాణం చేపడుతున్నది. ఉస్మాన్ కుంటను ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ ప్రాజెక్ట్ కంపెనీకి ధారాదత్తం చేశారు. 70 ఎకరాల భూమి ప్రణవ్ గ్రూపుకు ఎలా వెళ్లింది? అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు.