చట్ట వ్యతిరేకంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు

చట్ట వ్యతిరేకంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు
  • హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌‌ రెడ్డి పిటిషన్
  • రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గ్రామ సభల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుపై జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గ్రామసభ, వార్డు కమిటీల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ బుధవారం విచారించగా, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులు రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ, కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. 

రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకపక్షంగా గ్రామ స్థాయిలో కమిటీలు వేసిందని, వీటికి గ్రామసభలు, వార్డు కమిటీల నుంచి అనుమతి లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుకు వీలుగా రోడ్లు, రవాణా, భవన నిర్మాణాల శాఖ కార్యదర్శి ఈ నెల 11న జారీ చేసిన జీవో 33ను సస్పెండ్‌ చేయాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు.

గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టడం చెల్లదని చెప్పారు. అధికార పార్టీ వాళ్లల్లోని కమిటీలు పేదలనే ఎంపిక చేస్తే నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా కమిటీల ఏర్పాటు జీవో ఉందన్నారు.