- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: ఫాంహౌజ్ పార్టీ ఘటనలో తన కుటుంబాన్ని రక్షించాలంటూ డీజీపీకి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయని.. ఇదే నిజమైతే కేసీఆర్ కు ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. తన పదేండ్ల పాలనలో పోలీసు లాఠీల దెబ్బలకు రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు విలవిల్లాడితే ఏనాడూ కేసీఆర్ నోరు మెదపలేదని ఆయన ఒక ప్రకటనలో గుర్తు చేశారు. కేటీఆర్ బినామీ సంస్థ కారణంగా ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, నేరెళ్లలో దళితులపై పోలీసులు దారుణానికి ఒడిగట్టినప్పుడూ నోరు మెదపలేదని తెలిపారు. అప్పుడు ఏనాడూ డీజీపీకి ఫోన్ చేయని కేసీఆర్.. ఇప్పుడు ఫోన్ చేశారంటే.. ఆయనకు తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే తన కుటుంబమే ఎక్కువైందా? అని ప్రశ్నించారు.