- ప్రభుత్వ లెక్కలకు, జనాభా లెక్కలకు పొంతన లేదు
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ విమర్శ
- కులగణన సర్వే సక్కగా చేయలేదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోల్చిచూస్తే ప్రస్తుత సర్వేలో జనాభా తగ్గిందని.. ఈ తతంగమంతా బీసీలను మోసం చేసేందుకే అని దుయ్యబట్టారు. ‘‘లోక్‌సభలో రాహుల్ గాంధీ కులగణనపై అద్భుతంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు విని ఎంతో సంతోషించా.
కానీ, రాహుల్ వ్యాఖ్యలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పొంతన లేదు” అని వ్యాఖ్యానించారు. తన ఇంటికి సర్వేకు సంబంధించి రెండు స్టిక్కర్లు అంటించారని, సర్వేలో అనేక తప్పులు జరిగాయని, సమగ్రంగా జరగలేదని విమర్శించారు. మంగళవారం కులగణన సర్వేపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయిలో ప్రజలు కులగణనలో పాల్గొనలేదని శంకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకువస్తున్నారని, ఓట్లు పొందేందుకే బీసీ నినాదం అందుకుంటున్నారని దుయ్యబట్టారు.
‘‘ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతున్నది. జనాభా ప్రకారం బీసీలకు సగం సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. గెలుపు అవకాశాలు లేని స్థానాలకు బీసీలను పరిమితం చేస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలవని ఐదు అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించి లెక్కలు సరిచేసుకుంటున్నాయి. కులసంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో బీసీ సంఘాల భవనాలకు స్థలం కేటాయిస్తున్నారు. బలహీనవర్గాల విషయంలో కేవలం తీర్మానాలు చేసి వదిలేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.
కులగణన సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదాలు సృష్టించారని.. ఇట్లాంటివి ఉంటే కోర్టుల్లో కేసులు వేస్తే వారం రోజుల్లోనే కొట్టేస్తారని పేర్కొన్నారు. ఈ రకంగా కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కకు పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ పోరాటంలో ముందుంది బీసీ బిడ్డలేనని పాయల్ శంకర్ అన్నారు.
కులవృత్తులను ఆదుకుంటామని అన్నోళ్లంతా దొంగలేనని, కులవృత్తులను నమ్ముకున్నాం కాబట్టే ఇంకా ఎదగలేకపోయామని ఆయన పేర్కొన్నారు. కాగా, పాయల్ శంకర్ విమర్శలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా కులగణన నిర్వహించిందన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా సభలో మాట్లాడవద్దని సూచించారు. ఈ లెక్కలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు.