హనుమకొండ: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం లేదని మండిపడ్డారు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఎం మోడీపై కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రగతి బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అన్నట్లుగా ఉందన్న రఘునందన్... ప్రపంచ దేశాధినేతలు మోడీతో వేదికను పంచుకోవడానికి ఎదురు చూస్తున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను మోడీ తీసుకున్నారని చెప్పారు. వంద మంది మోడీలు వచ్చినా ఆర్టికల్ 370 రద్దు చేయలేరని ఫారూఖ్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ లాంటి వాళ్ళు విమర్శలు చేశారని, కానీ మోడీ తానొక్కరే 370 ఆర్టికల్ ను రద్దు చేయించారని తెలిపారు.
సర్జికల్ స్ట్రైక్స్ కు సాక్షాలు కావాలని రాహుల్ గాంధీ , కేసీఆర్ అంటున్నారని, దేశంపై వాళ్లకు ఏమాత్రం అభిమానం లేదని రఘునందన్ ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ఏ దేశంలో లేని విధంగా 200 కోట్ల డోసులు ఉచింతంగా అందించిన గొప్ప నేత మోడీ అని కొనియాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మోడీ ప్రదర్శించిన దౌత్య నీతి అసామాన్యమని, అమెరికా లాంటి దేశాలు కూడా చేయని పనిని మోడీ చేసి చూపించారని అన్నారు. అదానీ, అంబానీలు మోడీ పీఎం అయ్యాక వ్యాపారాలు పెట్టుకోలేదని, మోడీకి ముందే వాళ్లకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని చెప్పారు.
దేశ సంపదను మోడీ గణనీయంగా పెంచారన్న రఘునందన్... మోడీ ప్రధాని అయిన తర్వాత 4 లక్షల కోట్ల పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలిగామని రఘునందన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి వందలో 15 రూపాయలు మాత్రమే సామాన్యుడికి చేరుతోందని అప్పటి పీఎం రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అవినీతికి సాక్షమని, కానీ నేడు మోడీ అవినీతి రహిత పాలన చేస్తున్నారని వెల్లడించారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యాకు మోడీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. దేశ సంపదను ఎగ్గొట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న ప్రతి ఒక్కరిని మోడీ దేశానికి రప్పిస్తున్నారని స్పష్టం చేశారు.
దేశ రాజకీయాల్లో మోడీ సమూల మార్పులు తీసుకొచ్చారన్న రఘునందన్... 33 శాతం యువతను కొత్తగా పార్లమెంట్ కు పంపిన ఘనత ఆయనదేనన్నారు. 2024 ఎన్నికలకు ముందే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, బీజేపీతో మాత్రమే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ సహకారంతో వరంగల్ కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.