మునుగోడులో బీజేపీ సభ సక్సెస్ కాకూడదని సీఎం కేసీఆర్ కుట్ర పన్నిండని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం రోజు కూడా ఉపాధి హామీ పనులు ఉండవు.. దీంతో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామంటూ పంచాయతీ కార్యాలయాల దగ్గర జనాలను కూర్చొపెట్టి సర్పంచ్ లు బతిమిలాడుకుంటున్నారని వెల్లడించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని జీవో ఇచ్చారా ? పార్లమెంట్ లో బిల్లు పాసైందా ? చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2020, నవంబర్ నెలలో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే.. బావుల దగ్గర మీటర్లు పెడుతారని చెప్పారని.. మరి మీటర్లు పెట్టారా ? ప్రశ్నించారు. హుజూరాబాద్ జరిగిన ఉప ఎన్నికలో ఇదే విధంగా మాట్లాడారని.. కానీ ప్రజలు ఏ తీర్పునిచ్చారో తెలుసుకోవాలని సూచించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇబ్బందులు పెట్టిండ్రు...
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. నాలుగో ఆరును గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని రఘునందన్ రావు తెలిపారు. మూడున్నర సంవత్సరాలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అభివృద్ధి జరపాలని ప్రభుత్వం వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని, కానీ.. అలాంటి జరగకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుండడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారన్నారు. దీంతో సీఎం కేసీఆర్ లో ధైర్యం కన్నా ఎక్కువ అపనమ్మకం, భయం కనబడుతోందన్నారు. మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ సభకు ప్రజలు రారని భావించిన ఆయన హైదరాబాద్ నుంచే ప్రజలు ఇక్కడకు తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ నిర్వహిస్తున్న ఈ సభలో మునుగోడు ప్రజలే ఉన్నారని తెలిపారు. మల్లన్న సాగర్ విషయంలో సూదులు, దప్పనాలు తెచ్చుకుని పోలీసులను గుచ్చుతారని సాక్షాత్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని చెప్పారు.
కేసీఆర్ కు మోడీకి పోలిక ఉందా...
మరి నిన్న బహిరంగసభలో ఎవరిని కూర్చొ పెట్టుకున్నారని నిలదీశారు. ప్రగతి శీల ఐక్య వేదిక సంఘాలు ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారని.. కానీ.. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనం జరుగుతుందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఆయన జరిపిన పర్యటనలో ఎవరెవరిని కలిశారో.. వారి పరిస్థితి ఏంటో సభలో వివరించారు. మునుగోడులో సీపీఐకి ఏమైనా ఓట్లున్నాయా ? ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను సైతం ఎత్తుకెళ్లిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఏ ఒక్క రోజు సెలవు పెట్టకుండా పేద ప్రజల కోసం అహర్నిశలు మోడీ పని చేస్తున్నారని తెలిపారు. కేవలం ఫాం హౌస్ కు పరిమితమయ్యే కేసీఆర్ కు మోడీకి పోలిక ఎక్కడైనా ఉందా అని విమర్శించారు. రానున్న ఎన్నికలో రాజగోపాలరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.