హైదరాబాద్: గత కొన్ని వారాలుగా పెరుగుతున్న పెట్రో ధరలు తగ్గాయి. వాహనదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్ మీద రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో ఇంధన ధరలు తగ్గాయి. మోడీ సర్కార్ నిర్ణయంతో తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. ఈ విషయంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. పెట్రో రేట్లను కేంద్రం తగ్గించిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.
‘పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలి. తెలంగాణ సర్కారు పెట్రోల్ మీద ఒక లీటర్‌కు రూ.41 ట్యాక్స్ వేస్తోంది. డీజిల్ పై 8 నుంచి 10 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించాలి. ప్రతి దానికి కేంద్రంపై విమర్శలు చేయడం కాదు.. సెంట్రల్ సర్కారు ధరలు తగ్గించినప్పుడు రాష్ట్ర బాధ్యతగా ఇంధన ధరలు తగ్గించాలి’ అని రాజా సింగ్ అన్నారు.