తప్పకుండా డీజే పెడ్తం: కేసులు పెట్టండి.. ఏమైనా చేసుకోండి..

తప్పకుండా డీజే పెడ్తం: కేసులు పెట్టండి.. ఏమైనా చేసుకోండి..

హైదరాబాద్: డీజేలపై  నిషేధం సరైంది కాదని.. డీజేలపై ఆధారపడి బతికే వాళ్ళు కూడా ఉన్నారని బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 26) సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ డీజే, ఫైర్ క్రేకర్స్ బ్యాన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

డీజే, క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు ఉందని.. ఏదో అందరినీ పిలిచి ఒకమాట చెప్పాలన్నట్లుగా ఇవాళ్టి సమావేశం జరిగిందని అన్నారు. వెహికిల్‎లో స్పీడ్ లిమిట్‎కి ఎలా లాక్ ఉంటుందో.. అదే మాదిరి డీజే సౌండ్ లిమిట్ పెట్టాలని.. అంతేకానీ పూర్తిగా డీజేలను నిషేదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోజుకు నాలుగు సార్లు వినిపించే సౌండ్స్ బంద్ చేస్తే.. మా టెంపుల్స్‎లో సౌండ్స్ బంద్ చేస్తామని తేల్చి చెప్పారు. 

మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ హిందూ పండుగలను తొక్కిపెట్టే ప్రయత్నమేనని హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టనివ్వండి.. ఏమైనా చేసుకోనివ్వండని.. మేము మాత్రం యథావిధిగా మా ఉత్సవాలు చేసుకుంటామని స్పష్టం చేశారు. నేను 2010  నుంచి శ్రీరామ నవమి ర్యాలీలు నిర్వహిస్తున్నా.. కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదని గుర్తు చేసిన రాజాసింగ్.. శ్రీరామ నవమి ర్యాలీలో తప్పకుండా డీజే పెడ్తామని తేల్చి చెప్పారు.