ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి పిచ్చెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం చూస్తోందని పార్లమెంట్‌లో ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్ సాక్షిగా అన్ని రాజకీయపార్టీలను ఆయన తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
‘దేశంలోని ముఖ్యమైన పట్టణాలైన చెన్నై, ముంబై, బెంగుళూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలని కేంద్రం ఒక ప్లాన్ చేస్తోందని అసదుద్దీన్ అన్నారు. ఆయనకు అసలు బుద్ధి ఉందా? ఎక్కడ ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదా? ఆయన లా చదివారు, కానీ ఆయనకు ఏమాత్రం బుద్దిలేదు. కొన్ని పట్టణాలను కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలను చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. ఎప్పుడు నోరు విప్పినా లిటిగేషన్ మాటలే మాట్లాడుతాడు. మీడియా మొత్తం తన గురించి మాట్లాడుకోవాలనే చిన్న ఆలోచనలతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు లాభం చేకూరాలనే అసదుద్దీన్ ఇలా మాట్లాడుతున్నాడు. జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ ఏదీ తమ పార్టీకి దక్కకపోయేసరికి ఆయన మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాడు. అందుకే ఆయనకు ఏంమాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. అందుకే అసదుద్దీన్ ఓవైసీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రాజాసింగ్ అన్నారు.
For More News..