
- బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చారో లెక్క చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ దండుకోవడానికి దక్షిణ భాగం రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. నల్గొండ మంత్రులతో కలిసి దీనికి ప్లాన్ చేశారని పేర్కొన్నారు.
పేదల భూమి పోయేలా అలైన్ మెంట్ మార్చాలని కేంద్రం వద్దకు వెళ్తే ఒప్పు కోలేదన్నారు. పేదల భూములు పోతాయంటే ససేమిరా ఒప్పుకోబోమమని, అలైన్ మెంట్ మార్చబోమని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ చేతకాని ముఖ్యమంత్రి అని, కనీసం కేబినెట్ కూడా విస్తరణ చేపట్టలేని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు.