బీజేపీ సంచలన నిర్ణయం: డిప్యూటీ CM ఫడ్నవీస్ మాజీ పీఏకు ఎమ్మెల్యే టికెట్

బీజేపీ సంచలన నిర్ణయం: డిప్యూటీ CM  ఫడ్నవీస్ మాజీ పీఏకు ఎమ్మెల్యే టికెట్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో నిమగ్నమైపోయాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను సోమవారం (అక్టోబర్ 28) బీజేపీ విడుదల చేసింది. థర్డ్ లిస్ట్‎లో మొత్తం 25 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అయితే, బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మూడో జాబితా మహారాష్ట్ర పాలిటిక్స్‎లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదటి రెండు జాబితాల కంటే మూడో లిస్ట్ హైలెట్ కావడానికి కారణం వేరే ఉంది. 

సోమవారం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల థర్డ్ లిస్ట్‎లో బీజేపీ కీలక నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ మాజీ పీఏకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. గతంలో ఫడ్నవీస్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‎గా పని చేసిన సుమిత్ వాంఖడేకు అర్వీ అసెంబ్లీ టికెట్‎ను కేటాయించింది బీజేపీ. ఉప ముఖ్యమంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మహా పాలిటిక్స్‏లో హాట్ టాపిక్‎గా మారింది. వెర్సోవా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్, ఘట్కోపర్ తూర్పు నుండి పరాగ్ షా అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది. 

ALSO READ | ఓటు జిహాద్‌‌ వల్లే ఓడిపోయాం..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌‌

కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మహాయతి కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి151 సీట్లు దక్కాయి. మిగిలిన స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన 151 స్థానాలకు గానూ తొలి విడతలో 99 మంది పేర్లను అనౌన్స్ చేసింది. తాజాగా మూడో జాబితాలో 25 మంది అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసింది. మొత్తం మూడు జాబితాల్లో కలిపి 146 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. 

మిగిలిన ఐదు స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేయాల్సి ఉంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు. కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2024, నవంబర్ 20వ తేదీన సింగల్ ఫేజ్‎లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.