చార్మినార్​ భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్​ టెంపుల్​గా మారుస్తం : బీజేపీ ఎమ్మెల్సీల హామీ

చార్మినార్​ భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్​ టెంపుల్​గా మారుస్తం : బీజేపీ ఎమ్మెల్సీల హామీ

చార్మినార్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్  టెంపుల్​గా అభివృద్ధి చేస్తామని కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య హామీ ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్  శంకర్, కాటేపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి శనివారం చార్మినార్  భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్సీలు  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్  చైర్మన్  శశికళ ఆ నాయకులను సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని కాదని మేధావులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. చార్మినార్ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్  టెంపుల్ గా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్  టెంపుల్  మారుస్తామన్నారు.

ఇటీవల గ్రూప్ –1 పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయని, దీంతో పరీక్ష అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎక్కువ శాతం అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రీవాల్యుయేషన్ కు అవకాశం కల్పించి అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.