హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ప్రతిపక్ష పార్టీలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి. లగచర్ల రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రైతులకు మద్దతుగా మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ గురువారం (డిసెంబర్ 19) వెరైటీగా నిరసన తెలిపింది. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎడ్లబండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్ల బండ్లపై కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. కాగా, రైతు హామీలు, అమలు వైఫల్యంపై సభలో చర్చ నిర్వహించాలని స్పీకర్‌కు బుధవారం బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అంటూ మండిపడిన బీజేపీ.. రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం నిరాకరించడానికి నిరసనగా గురువారం (డిసెంబర్ 19) ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.