క్యాన్సర్.. కరోనా.. కలిస్తే కాంగ్రెస్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా

క్యాన్సర్.. కరోనా.. కలిస్తే కాంగ్రెస్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా

సంగారెడ్డి టౌన్, వెలుగు:  క్యాన్సర్.. కరోనా కలిస్తే కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా చేశారు.15 నెలలు గడిచినా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు సాధించలేకపోయారని విమర్శించారు. బీజేపీపై గుజరాత్​లో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను స్థాపించినది బ్రిటీష్ జాతీయుడని మర్చిపోయినట్లున్నారని గుర్తుచేశారు. 

గురువారం సంగారెడ్డిలోని బీజేపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయబోనని రేవంత్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని,  సాక్షాత్తూ తన సొంత జిల్లాలోని మహబూబ్ నగర్,  సిట్టింగ్ సీటు మల్కాజిగిరిని బీజేపీ గెలుచుకుందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకే మజ్లిస్, బీఆర్​ఎస్​తో కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. 

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని స్థాయిలో ఉండడం కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమన్నారు . మజ్లిస్​ను గెలిపించడానికి మద్దతిస్తుందని, అయినా బీజేపీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు మానుకోవాలని, ఆరు గ్యారంటీల అమలు,  ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.