గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ
  • రెండో స్థానంలో నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ 
  •  ఓవరాల్​గా లీడ్​లో బీజేపీ క్యాండిడేట్​
  • ఆరో రౌండ్​ పూర్తయ్యే సరికి 7,118 ఓట్ల ఆధిక్యం
  • ఫస్ట్ ప్రయార్టీ ఓట్లతో ఫలితం తేలడం కష్టమే
  • సెకండ్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు తర్వాతే తేలనున్న విజేత
  • నేటి రాత్రి వరకు రానున్న తుది ఫలితం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతున్నది. ఆరో రౌండ్ వరకు అధికారులు లక్షా 26 వేల ఓట్లు లెక్కించగా  బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి ముందంజలో ఉన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండు,  బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కరీంనగర్​లోని అంబేద్కర్​ స్టేడియంలో  చెల్లుబాటయ్యే, చెల్లుబాటుకాని ఓట్లను వేరు చేశాక కౌంటింగ్ సిబ్బంది మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల కౌంటింగ్​ను ప్రారంభించారు.  పోస్టల్ బ్యాలెట్​తో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోలవ్వగా  ఇందులో సుమారు  -28 వేల ఓట్లు ఇన్​వ్యాలిడ్​ కాగా, సుమారు 2 లక్షల 24 వేల ఓట్లు వ్యాలిడ్​ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్కో రౌండ్​లో 21 టేబుళ్లలో.. టేబుల్ కు వెయ్యి చొప్పున 21 వేల ఓట్లను  లెక్కిస్తున్నట్లు తెలిపారు. 

ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు 11 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఫస్ట్  ప్రయార్టీ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టాక  మొదటి రౌండ్  నుంచి 5 రౌండ్ల వరకూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఆరో రౌండ్​లో తొలిసారిగా కాంగ్రెస్​ అభ్యర్థి నరేందర్​ రెడ్డి  -205 ఓట్ల లీడ్​ సాధించారు. ఫస్ట్ రౌండ్​లో అంజిరెడ్డికి 6,712 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్​ నరేందర్ రెడ్డికి- 6,676, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,867 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో అంజిరెడ్డికి 7,979 ఓట్లు, నరేందర్ రెడ్డికి- 6,522 ఓట్లు,  ప్రసన్న హరికృష్ణకు - 4,927  ఓట్లు పోలయ్యాయి. 

మూడో రౌండ్​లో అంజిరెడ్డికి 8,619 ఓట్లు, నరేందర్ రెడ్డి-కి 5,614,  ప్రసన్న హరికృష్ణ-కు  5,086 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్​కు వచ్చేసరికి అంజిరెడ్డికి 7,807, నరేందర్ రెడ్డికి 6,544, ప్రసన్న హరికృష్ణకు 5,271 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్​లో అంజిరెడ్డికి 7,850, నరేందర్​ రెడ్డికి 6,288, ప్రసన్న హరికృష్ణకు 5,411 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్​లో అంజిరెడ్డికి 6,855, నరేందర్​ రెడ్డికి 7,060, ప్రసన్న హరికృష్ణకు 5,548 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్​ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 7,118 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే ఈ  ఎన్నికల్లో జాతీయ పార్టీల తరఫున పోటీ చేసిన అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నది. వీరితోపాటు బరిలో నిలిచిన రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు.  

సెకండ్ ప్రయార్టీ ఓట్లతోనే విన్ డిక్లేర్! 

అధికారుల లెక్క ప్రకారం చెల్లుబాటైన 2.24 లక్షల ఫస్ట్ ప్రయార్టీ ఓట్లలో 1.12 లక్షల ఓట్లు ఎవరికొస్తే ఆ అభ్యర్థే విజేత అవుతారు. త్రిముఖ పోరు ఉండడంతో ముగ్గురి మధ్య చీలుతున్న ఓట్లను చూస్తే ఒక్కరికే సగం ఓట్లు పడే అవకాశం కనిపించడం లేదు. కోటా ఓట్లు రాకుంటే సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల బుధవారం లెక్కించబోయే సెకండ్ ప్రయార్టీ ఓట్లతోనే అభ్యర్థుల భవితవ్యం తేలే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఫలితం నేటి రాత్రి వరకు తేలనున్నది.