మధ్యతరగతికి బీజేపీ దూరమవుతోందా?

మధ్యతరగతికి బీజేపీ దూరమవుతోందా?

విభీషణుడి మాట రావణాసురుడు,  విదురుడి మాట ధృతరాష్ట్రుడు,  గడ్కరీ మాట ఎన్డీఏ  ప్రభుత్వం వింటే.. యుద్ధాలు,  విధ్వంసాలు, వినాశనాలు తప్పేవేమో!   వైద్య,  జీవిత బీమా ప్రీమియంపైన 18 శాతం (జీఎస్టీ) పన్ను విధింపు మంచిది కాదని, ఉపసంహరించాలని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు తాజాగా లేఖరాసి  చెప్పినది  ఖచ్చితంగా హితవాక్యమే!   క్రమంగా ఒక్కోవర్గాన్ని దూరం చేసుకుంటున్న బీజేపీ దేశంలోని మధ్యతరగతి  అసంతృప్తిని గమనిస్తున్నట్టు లేదు.  రైతాంగం,  దళితులు,  యువతరం,  మధ్యతరగతి.. ఇలా ఒక్కోవర్గాన్ని నెమ్మదిగా దూరం చేసుకుంటున్న బీజేపీ, ఇప్పుడు హిందూత్వవాదం బలహీనపడుతున్న పరిస్థితుల్లో రాజకీయంగా పెను సవాళ్లనే ఎదుర్కొంటోంది.  కొన్నివర్గాలు దూరమవుతున్నట్టు నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సంకేతాలు వెలువడగా,  దాన్ని పెద్దగా లక్ష్యపెట్టని బీజేపీ నాయకత్వ వైఖరి తాజా బడ్జెట్ ప్రతిపాదనలతో బట్టబయలైంది. 

ఎన్నికల ఫలితాలను,  తద్వారా  ప్రజలిచ్చే మౌన సందేశాన్ని రాజకీయ పార్టీలు వినడం మానేశాయి, అందుకు బీజేపీ కూడా ఏం మినహాయింపు కాదు. నిన్నటికి నిన్న (2024) సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని కొన్ని నిర్దిష్ట వర్గాలు ఓటు ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి.  ముఖ్యంగా బీజేపీ,  అది నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏని ఈసారి ఎన్నికల్లో  పరిమితం చేస్తూ ప్రజలు అనూహ్యమైన తీర్పునిచ్చారు.  సదరు సంకేతాలను విశ్లేషించి -ఆత్మపరిశీలన చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటే ఇందుకు నిదర్శనం.  

సబ్బండ వర్గాలను విస్మరించిన బడ్జెట్​

మధ్యతరగతిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించి  ప్రసన్నం చేసుకునే ఏ ప్రయత్నమూ ఎన్డీఏ వైపు నుంచి జరగలేదని బడ్జెట్ చెప్పకనే చెప్పింది. మరోపక్క ముంచుకు వస్తున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్టీ నాయకత్వానికి సరికొత్త సవాల్​గా  పరిణమించాయి. ‘అబ్​కీ బార్ చార్​సౌ పార్’ అని నినాదమిస్తే,  సీట్ల సంఖ్య పెరగకపోగా కిందటి ఎన్నికల మెజార్టీ కంటే ఈసారి తగ్గింది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 401 లోక్​సభ స్థానాలు సాధించిన తర్వాత, ఇక పతనం ప్రారంభమైతే  ఇప్పటివరకు ఆ పార్టీ కోలుకోనేలేదు. రాజకీయాల్లో పతనం..ఒకోసారి పాకుడుబండపై నుంచి జారడం లాగానే ఉంటుంది.  బీజేపీకి కూడా 2019లో సాధించిన 303 స్థానాలే గరిష్టమా?  నిన్న కనాకష్టంగా సాధించిన 240 ఒక రకంగా పతన సంకేతమేనా?  ఇదంతా గమనిస్తున్న పార్టీ సైద్ధాంతిక మాతృక అయిన ఆర్ఎస్ఎస్​ ఈ విషయంలో  ఏమాలోచిస్తున్నట్టు?  ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానాలు రావాల్సిన ప్రశ్నలే!

ఏదీ మందహాసం?

సగటు భారతదేశాన్ని ప్రతిబింబించేది మధ్యతరగతే!  భావజాలం పరంగానే కాకుండా సమాజంలోని ఇతర వర్గాలను ప్రభావితం చేసే సత్తా కలిగిన ఒక బలమైన అభివ్యక్తి మధ్యతరగతి.  కంపెనీల హెడ్లు,  కార్పొరేట్ల సీఈవోలు, ప్రభుత్వ శాఖాధిపతులు వంటి  సుసంపన్నులు కాకుండా..  దేశంలోని ప్రభుత్వ,  ప్రయివేటు ఉద్యోగులంతా దాదాపు ఇందులోకి వచ్చేవారే! మెజార్టీ రైతులు మధ్యతరగతే!  సగటుతో పాటు ఎగువ,  దిగువ మధ్యతరగతి దేశంలో ఓ పెద్ద సెక్షన్.  అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు సగటున 17–-100 డాలర్ల మధ్య సంపాదించేవారు మధ్యతరగతి (ఎగువ,- దిగువ అన్నీ కలిపి) అని ఓ లెక్కుంది. అటు సంపదతో తులతూగే ధనవంతులు కాక,  ఇటు సర్కార్ల  సంక్షేమ పథకాలతో ఊరట దొరికే  నిరుపేదలు కాకుండా.. మధ్యలో ఊగిసలాడే తాము,  త్రిశంకు స్వర్గవాసులమని మనస్తాపం చెందుతూ ఉండే బ్యాచ్ ఇది. ఈ బ్రాకెట్ (స్పిండిల్ షేప్) దేశంలో క్రమంగా విస్తరిస్తోందని ప్రపంచబ్యాంకుతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి.  2005 నాటికి  దేశ జనాభాలో 14 శాతంగా ఉన్న మధ్యతరగతి, ఇప్పుడు ఏకంగా 31 శాతానికి విస్తరించింది. అంటే 43.2 కోట్ల మంది భారతీయుల సమాహారం మధ్యతరగతి.  ఈ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే రాజకీయ మనుగడ ఉంటుందా?  ‘వాట్సాప్ యూనివర్సిటీ’ల మాయా కథనాల ద్వారా ఎవరైనా, ఎవర్నయినా? ఎంతకాలం మభ్యపెట్టగలరు! ఇప్పుడిదే బీజేపీ అధినాయకత్వం ముందున్న అతిపెద్ద సవాల్!

కలవరపరిచే గణాంకాలు

జనసంఘ్​నాటి నుంచీ బీజేపీకి,  దాని పూర్వరూపానికి భారత సమాజంలో బలమైన మద్దతుదారు మధ్యతరగతి సమాజం. ఆ పునాది మీదే బీజేపీ ఎదిగింది. రాజకీయ పరిస్థితుల్లో, పరిణామాల్లో తీవ్రమైన మార్పులు వచ్చినపుడు కూడా.. ఈ వర్గం బీజేపీకి వెన్నుదన్నుగా నిలబడింది. ఆ పట్టు ఇప్పుడు క్రమంగా సడలుతోంది. దేశవ్యాప్తంగా చూసినపుడు, బీజేపీకి గత ఎన్నికల్లో లభించిన మధ్యతరగతి మద్దతు 38 శాతం నుంచి నిన్నటి సార్వత్రిక (2024) ఎన్నికల్లో 35 శాతానికి తగ్గినట్టు జాతీయ ఎన్నికల సర్వే (ఎన్.ఈ.ఎస్) తెలిపింది. ఎగువ మధ్య తరగతిలోనూ  దాదాపు 3 శాతం షిప్ట్ (44 నుంచి 41 శాతానికి తగ్గి) ఇతర పక్షాలకు మళ్లింది. అల్పాదాయ వర్గాలూ బీజేపీకి దూరమౌతున్న సంకేతాలున్నాయి.  ఇక అల్పాదాయ వర్గాల్లో ‘ఇండియా కూటమి’కి మద్దతు 28 నుంచి 35 శాతానికి (నికరంగా 7 శాతం) పెరిగింది. నిరుపేద వర్గాల్లో మాత్రమే 1 శాతం మద్దతును బీజేపీ-ఎన్డీఏ కూటమి (36 నుంచి 37 శాతం) పెంచుకోగలిగింది.  తటస్థ- మూడో పక్షం బలహీనపడిన పరిస్థితుల్లో కాంగ్రెస్ (21శాతం) ఇండియా కూటమి(34 శాతం) కూడా నిరుపేదల్లో మద్దతును ఇదివరకటి కన్నా పెంచుకోగలిగాయి.

చేజారిన అవకాశం

దూరమౌతున్న మధ్యతరగతిని చేరదీసేందుకు, 45.25 లక్షల కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశంగా ఉండింది. కానీ, ఎన్డీఏ సర్కారు దాన్ని చేజార్చుకుంది. మధ్యతరగతి, అల్పాదాయ, దిగువ- ఎగువ మధ్యతరగతి ఆశించిన పలు అంశాలేవీ బడ్జెట్​లో  చోటుచేసుకోలేదు. ఫలితంగా వారికి ఏ ఊరటా లభించలేదు. ఇక ఆదాయపన్నుల విధానం కూడా ప్రభావిత వర్గాలు ఆశించిన ఏ సానుకూల సంస్కరణలకు నోచుకోకపోగా మ్యూచ్​వల్​ ఫండ్స్, షేర్ల పొదుపు ద్వారా లభించే వడ్డీపై  పన్ను శాతాలను పెంచడం మధ్యతరగతికి అదనపు భారమైంది.  దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్​పై  పన్ను 10 నుంచి 12.5 శాతానికి,  స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్​పై  పన్ను 15 నుంచి 20 శాతానికి పెంచాలనే ప్రతిపాదన ఆశనిపాతమే!   గడ్కరీ చెప్పినట్టు, వైద్య-, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం (జీఎస్టీ) పన్ను వసూలు అంటే, జరుగుతుందో  లేదో  తెలియని భవిష్యత్  అనిశ్చితాల మీద కూడా ఇప్పుడే పన్ను విధించడం, ఎంత దుర్మార్గం? అనే ప్రశ్న సగటు జనం మెదళ్లలో మొలకెత్తుతోంది.

దృష్టిపెట్టకుంటే ఎలా?

గత పదేండ్లలో  కార్పొరేట్ రంగ అప్పులు 14.46 లక్షల కోట్ల మేర మాఫీ చేశారు.  పలురకాల పన్ను- సుంకాల రాయితీలు అమలుచేశారు. అంకురాలతో  సహా పలు ఉత్పాదక, సేవా పరిశ్రమలు, సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించినట్టు దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి కొత్తగా బయటకు తెచ్చారు. ఇంకోవైపు 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నారు. మరి మధ్యతరగతి వారి సంగతి పట్టదా?  పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ,  కొవిడ్ మహమ్మారి సృష్టించిన కల్లోలం.. వీటికి మధ్యతరగతే  బాగా ప్రభావితమైంది. వారికి ఉపశమనమిచ్చే నిర్దిష్ట చర్యలేవీ బడ్టెట్​లో ప్రతిపాదించలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు.  ఏటా 30 లక్షల మందికి ఉద్యోగాలివ్వాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ ఉంది.  మానవాభివృద్ది సూచీ, 193 దేశాల జాబితాలో భారత్ 134 వ స్థానంలో (2023- 24) ఉండటానికి మధ్యతరగతిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే కారణం.  ప్రపంచ మానవుల ఆనంద సూచీ నివేదిక ప్రకారం143 దేశాల్లో భారత్ 126 వ స్థానంలో  ఉండటానికి కారణం మధ్యతరగతి మందహాసం మరుగునపడటమే! పాలకులు ఆలోచించాలి.

- దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ